Rahul Gandhi: రెండో రోజూ రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ.. నేడు కూడా రావాలంటూ సమన్లు

  • రాహుల్‌ను 11 గంటలపాటు విచారించిన అధికారులు
  • విచారణ ఆలస్యానికి రాహులే కారణమన్న ఈడీ
  • క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత
  • నిన్ననే విచారణ పూర్తి చేయమని కోరిన రాహుల్
  • కుదరదంటూ మరోమారు సమన్లు ఇచ్చిన ఈడీ
Rahul Gandhi to appear before ED again for 3rd round of questioning today

నేషనల్ హెరాల్డ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నిన్న ఏకంగా 11 గంటలపాటు విచారణ ఎదుర్కొన్నారు. నిన్న ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్‌.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకుని ఇంటికి వెళ్లి లంచ్ చేసి తిరిగి 4.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏకబిగిన రాహుల్‌ను విచారించారు.

తొలుత యంగ్ ఇండియన్ కంపెనీలో రాహుల్ పెట్టుబడులు, ఆ కంపెనీతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తో లావేదేవీల డాక్యుమెంట్లను ఆయన ముందు ఉంచి చదవాలని కోరారు. ఆ వ్యాపారాల్లో ఆయన పాత్రపైనా పలు ప్రశ్నలు గుప్పించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో రాహుల్‌ను కనీసం 25 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఈడీ ప్రశ్నలకు రాహుల్ ఆచితూచి సమాధానాలు చెప్పారని, ఏ ప్రశ్నను ఎలా తప్పించుకోవాలన్న దానిపై న్యాయవాదులు ఆయనకు బాగా శిక్షణ ఇచ్చినట్టు కనిపిస్తోందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ జాప్యానికి కారణం మీరేనని అధికారులు చెప్పడంతో రాహుల్ క్షమాపణలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది.

కోల్‌కతాకు చెందిన డోటెక్స్ మర్కండైజ్ సంస్థకు ఉన్న సంబంధాలపై అధికారులు నిన్న రాహుల్‌ను ప్రశ్నించారు. ఈ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ 2010లో కోటి రూపాయల రుణం తీసుకుంది. డోటెక్స్ షెల్ కంపెనీ కాదని, తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించినట్టు రాహుల్ తెలిపారు. ఆ తర్వాత తీసుకున్న మొత్తాన్ని కూడా చెల్లించినట్టు రాహుల్ గుర్తు చేశారు. ఆలస్యమైనా పర్వాలేదని మంగళవారమే విచారణ పూర్తి చేయాలని రాహుల్ ఈడీ అధికారులను కోరగా, వారు అందుకు నిరాకరించారు. నేడు కూడా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ సమన్లు జారీ చేశారు. 

ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్‌ ధర్నా

రాహుల్‌ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ నేతలు వరుసగా రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. సోమవారం ఈడీ కార్యాలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మంగళవారం దిగ్బంధించారు. నేతలు, కార్యకర్తలను అటు వైపే రానివ్వలేదు. ఈడీ కార్యాలయానికి వెళ్లేముందు రాహుల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌ సీఎంలు అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, ఎంపీలు, కార్యకర్తలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. కార్యాలయం చుట్టూ మోహరించిన పోలీసులు.. పలువురు నేతలను లోపలకు వెళ్లనివ్వలేదు.

More Telugu News