IPL: ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు స్టార్ టీవీ సొంతం... డిజిటల్ హక్కులు చేజిక్కించుకున్న వయాకామ్ 18

  • ముగిసిన ఐపీఎల్ ప్రసార హక్కుల బిడ్డింగ్
  • రూ.23,575 కోట్లతో బిడ్ వేసిన స్టార్ ఇండియా
  • ఐదేళ్ల కాలావధికి హక్కులు సొంతం
  • రూ.23,758 కోట్ల మేర బిడ్ వేసిన వయాకామ్
Jay Shah reveals IPL bidding details

ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం నిర్వహించిన ఈ-బిడ్డింగ్ ప్రక్రియలో బీసీసీఐపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయాకామ్ 18 సంస్థ చేజిక్కించుకుంది. వయాకామ్ 18 మొత్తం రూ.23,758 కోట్ల బిడ్డింగ్ తో డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూకే ప్రాంతాల డిజిటల్ హక్కులు వయాకామ్ 18 కైవసం చేసుకుందని, మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా, అమెరికా, తదితర దేశాల డిజిటల్ ప్రసార హక్కులను టైమ్స్ ఇంటర్నెట్ చేజిక్కించుకుందని జై షా తెలిపారు. 

టీవీ ప్రసార హక్కులను స్టార్ ఇండియా దక్కించుకుందని, స్టార్ ఇండియా అత్యధికంగా రూ.23,575 కోట్లకు బిడ్ వేసిందని తెలిపారు. మొత్తమ్మీద ఓవరాల్ గా ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రూ.48,390 కోట్లు అని జై షా వివరించారు. 

వరుసగా రెండేళ్లు కరోనా సంక్షోభం వేధించినప్పటికీ, ఈ స్థాయిలో బిడ్డింగ్ రావడం బీసీసీఐ సంస్థాగత సామర్థ్యాలకు గీటురాయి అని వివరించారు. ఓ మ్యాచ్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్టింగ్ లీగ్ ల్లో రెండోస్థానంలో ఉంటుందని తెలిపారు. కాగా, ఐపీఎల్ ద్వారా సమకూరిన ఆదాయాన్ని బీసీసీఐ క్షేత్రస్థాయి నుంచి దేశవాళీ క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుందని వెల్లడించారు.

More Telugu News