Andhra Pradesh: వైసీపీకి ఇదో మంచి ఛాన్స్‌... కేంద్రం నుంచి ఏదైనా సాధించుకోవ‌చ్చు: ఉండ‌వ‌ల్లి

  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీకి బ‌లం లేదన్న ఉండవల్లి 
  • వైసీపీ మ‌ద్ద‌తు బీజేపీకి కీల‌కమని వ్యాఖ్య 
  • వైసీపీ ఏది అడిగినా బీజేపీ త‌లొగ్గి తీరుతుందన్న ఉండవల్లి 
  • ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైసీపీకి ఇది మంచి అవ‌కాశమని కామెంట్ 
  • బీజేపీపై వైసీపీ ఒత్తిడి చేస్తుందో, లేదో తెలియ‌ద‌న్న ఉండ‌వ‌ల్లి
undavali comments on ysrcp stamina

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా తానేం చ‌ర్చించానన్న విష‌యంపై నేడు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు దిశ‌గా బీజేపీ ప్ర‌భుత్వం దిగివ‌చ్చేలా చేయ‌డం వంటి అంశాల‌పై ఏపీలో అధికార పార్టీకి ఇప్పుడు మంచి అవ‌కాశం ల‌భించింద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. వైసీపీకి ఇంత‌టి మంచి అవ‌కాశం మ‌రెప్పుడూ రాబోద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాష్ట్రప‌తి ఎన్నికల్లో బీజేపీకి స‌రిప‌డ బ‌లం లేద‌న్న ఉండవల్లి... ప‌లు ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ఇలాంటి పార్టీల్లో వైసీపీ చాలా పెద్ద పార్టీగా ఉంద‌ని, వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ లెక్క‌న బీజేపీకి వైసీపీ అవ‌స‌రం చాలానే ఉంద‌న్నారు. అంతేకాకుండా బీజేపీ అభ్య‌ర్థి గెలుపులో వైసీపీ మ‌ద్ద‌తు కీల‌కం కానుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. వైసీపీ స్థాయిలో బ‌లం ఉన్న పార్టీలు ఏవీ లేవ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ మ‌ద్ద‌తు కావాలంటే...తాము అడిగిన‌వ‌న్నీ చేయాల్సిందేన‌ని బీజేపీ మీద ఒత్తిడి చేసే అవకాశం వైసీపీకి ఉంద‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ ఏది అడిగితే అది చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ ప‌రిస్థితిని అవ‌కాశంగా మ‌ల‌చుకుని ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించే అవ‌కాశం వైసీపీకి ల‌భించింద‌ని కూడా ఆయ‌న చెప్పారు. అయితే ఇంత‌టి మంచి అవ‌కాశాన్ని జ‌గ‌న్ స‌ద్వినియోగం చేసుకుంటారా?  లేదా? అన్న‌ది త‌న‌కు తెలియ‌ద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. అస‌లు జ‌గ‌న్ ఏది డిమాండ్ చేసినా బీజేపీ త‌లొగ్గి తీరుతుంద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

More Telugu News