Charles A Flynn: లడఖ్ సమీపంలో చైనా వంతెన నిర్మాణం పట్ల అమెరికా సైనిక జనరల్ స్పందన

  • కొంతకాలంగా సరిహద్దుల వెంబడి చైనా నిర్మాణాలు
  • లడఖ్ సమీపంలో మరో వంతెన నిర్మాణం
  • ఇది మేల్కొలుపు వంటిదన్న జనరల్ ఫ్లిన్
  • చైనాకు అడ్డుకట్ట వేయాలని పిలుపు
US military general Charles A Flynn talks about China bridge construction at Ladakh region

భారత్ సరిహద్దుల సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఇప్పటిది కాదు. ఇటీవల లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైంది. దీనిపై అమెరికా సైనిక జనరల్ చార్లెస్ ఏ ఫ్లిన్ స్పందించారు. ఇది అప్రమత్తం కావాల్సిన సమయం అని, ఈ స్థాయిలో చైనా నిర్మాణాలు చేపడుతుండడం మేల్కొలుపు వంటిదని అన్నారు. చార్లెస్ ఏ ఫ్లిన్ అమెరికా సైన్యం పసిఫిక్ విభాగంలో కమాండింగ్ జనరల్ గా ఉన్నారు. 

హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతున్న తీరు చూస్తుంటే ఈ ప్రాంతంలో అస్థిరతను పెంపొందిస్తూ, కబళించి వేయాలన్న ప్రయత్నంగా కనిపిస్తోందని ఫ్లిన్ అభివర్ణించారు. ఈ ప్రాంతంలో ఇటువంటి ధోరణులు ఎంతమాత్రం ఉపయుక్తం కాదని, అసలిదంతా ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. 

ఈ నేపథ్యంలో, చైనా దుందుడుకు ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనరల్ ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు.

More Telugu News