Joe Root: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ అరుదైన రికార్డు

  • 10 వేల పరుగులు సాధించిన రూట్
  • లార్డ్స్ లో న్యూజిలాండ్ పై సెంచరీ
  • ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్
  • 31 ఏళ్ల వయసులో 10 వేల పరుగుల మార్కు అందుకున్న రూట్
Joe Root completes ten thousand runs in Test cricket

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (115 నాటౌట్) విఖ్యాత లార్డ్స్ మైదానంలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. రూట్ సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, రూట్ సమయోచితంగా ఆడి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

ఈ క్రమంలో రూట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో తక్కువ వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా మాజీ సారథి ఆలిస్టర్ కుక్ రికార్డును సమం చేశాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. 

అయితే 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి కుక్ కు 229 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, రూట్ 218 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వరల్డ్ వైడ్ గా చూస్తే 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 14వ వాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 10వ వాడు.

More Telugu News