Andhra Pradesh: ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆకాష్ హత్య తర్వాత రైలులో చెన్నై చెక్కేసిన ప్రధాన నిందితులు!

  • విజయవాడలో ఇటీవల దీపక్ ఆకాష్ దారుణ హత్య
  • బార్ వద్ద గొడవ తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి హత్య
  • నిందితులు గోపీకృష్ణ, మురళీకృష్ణ చెన్నైలో ఉన్నట్టు గుర్తింపు
  • ప్రత్యేక బృందాలతో గాలింపు
prime accused in football player aakash muder case are in chennai

విజయవాడలో ఇటీవల హత్యకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు గిలకా దీపక్ ఆకాష్ హత్యకేసు నిందితులు చెన్నైలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆకాష్ హత్యకేసులో గుణదల విజయపురి కాలనీకి చెందిన గోపీకృష్ణ అలియాస్ ప్రభ, అతడి అన్న మురళీకృష్ణ ప్రధాన నిందితులు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషా బార్ వద్ద గొడవ జరిగిన తర్వాత అన్న మురళీకృష్ణకు ఫోన్ చేసిన గోపీకృష్ణ విషయం చెప్పాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి గురునానక్ కాలనీలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆకాష్ వద్దకు వెళ్లారు. 

ఆ సమయంలో ఆకాష్‌తోపాటు అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. అందరూ కలిసి ఆకాష్‌పై దాడిచేశారు. గోపీకృష్ణ, మురళీకృష్ణ కత్తులతో ఆకాష్‌ను పొడిచి చంపేశారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. గోపీకృష్ణ, మురళీకృష్ణ మాత్రం రైలులో చెన్నైకి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు, ఈ కేసుతో ప్రమేయం ఉన్న మిగతా వారిని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

More Telugu News