Bank manager: జమ్మూలో బ్యాంకు మేనేజర్ పై కాల్పులు.. ఇది ఎనిమిదో హత్య

  • కుల్గామ్ జిల్లాలో దారుణం
  • రెండు రోజుల క్రితమే కశ్మీరీ పండిట్ టీచర్ హత్య
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం
Bank manager shot dead in Jammu and Kashmir Kulgam district

జమ్మూకశ్మీర్లో అశాంతికి ఉగ్రవాదులు వ్యూహం మార్చినట్టున్నారు. ఒకదాని తర్వాత మరొకటిగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బ్యాంకు మేనేజర్ ను జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు. 

ఎల్లఖి దేహతి బ్యాంకు శాఖలోపల ఉన్న సమయంలోనే మేనేజర్ విజయ్ కుమార్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్ గఢ్ వాసిగా పోలీసులు గుర్తించారు. 

కుల్గామ్ జిల్లాలోనే రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ అయిన మహిళా టీచర్ (రజనీ బాల)ను కాల్చి చంపడం తెలిసిందే. గడిచిన రెండు నెలల్లో ఇద్దరు పౌరులు (ఒకరు కశ్మీరీ పండిట్), ముగ్గురు పోలీసులను కూడా ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. తాజా ఘటనను రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ఖండించారు. జమ్మూకశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

మరోపక్క, ఈ హత్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ సైతం తాజా ఘటనను తీవ్రమైనదిగా పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన అంశంగా తెలిపారు. భద్రతా సంస్థలు ఈ దాడులను అరికట్టేందుకు తగిన విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News