Kejriwal: మోదీజీ మా అందరినీ అరెస్ట్ చేయండి.. కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్

  • మనీష్ సిసోడియా అరెస్ట్ కు సన్నాహాలు చేస్తున్నారన్న కేజ్రీవాల్ 
  • తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్న ఆప్ అధినేత 
  • అందరినీ ఒకేసారి జైల్లో పెట్టాలని మోదీకి రిక్వెస్ట్ 
Manish Sisodia to be arrested next in fake case Kejriwal big claim after Satyendar Jain arrest

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర సర్కారుపై మండి పడ్డారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యంద్రజైన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేస్తారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. 

‘‘సత్యేంద్రజైన్ అరెస్ట్ తర్వాత.. సెంట్రల్ ఏజెన్సీలు మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేయాలని అనుకుంటున్నట్టు మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. మనీష్ సిసోసిడియాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరింది’’ అని కేజ్రీవాల్ సంచలన అరోపణలు చేశారు.

‘‘మీ సిసోడియా అవినీతి పరుడా? నేను 18 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడగాలనుకుంటున్నాను’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ఆప్ నేతలు అందరినీ అరెస్ట్ చేయండి మోదీజీ' అని ఆయన అన్నారు. 

‘‘నేను ప్రధాని మోదీని కోరేదేమిటంటే.. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లి ఒకేసారి జైల్లో పడేయండి. అన్ని కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఒకేసారి దర్యాప్తు చేయాలి. మీకు కావాల్సినన్ని సార్లు దాడులు (సోదాలు) చేయండి. ఒకసారి ఒక మంత్రిని అరెస్ట్ చేయడం వల్ల పనులు నిలిచిపోతాయి. కొందరు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వల్లే ఇదంతా అని అంటున్నారు. కొందరేమో పంజాబ్ ఎన్నికల ప్రతీకారంగా చెబుతున్నారు. ఏదైమైనా కానీయండి. అరెస్ట్ లకు భయపడేది లేదు’’ అని కేజ్రీవాల్ కేంద్రంపై ఆరోపణల దాడికి దిగారు.

More Telugu News