Osmania General Hospital: పచ్చబొట్టు తొలగించుకోవాలనుకుంటున్నారా?.. ఉస్మానియాలో ఉచితంగా శస్త్రచికిత్సలు

  • డెర్మ్ఎబ్రేషన్ ప్రక్రియ ద్వారా పచ్చబొట్టు తొలగింపు
  • ఆ తర్వాత మచ్చ తొలగింపునకు లేజర్ సర్జరీ
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. లక్షకు పైనే ఖర్చు
  • పచ్చబొట్ల వల్ల ఎయిడ్స్, హెపటైటిస్ సోకే ప్రమాదం ఉందన్న ఉస్మానియా సర్జన్
Tattoo Free Removal Camp in Hyderabad Osmania Hospital

సరదాగానో, ఒకరిపై ప్రేమతోనే, ఇష్టంతోనే వేయించుకున్న పచ్చబొట్లు ఆ బంధానికి బీటలు వారాక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. అంతేకాదు, ఒక్కోసారి ఇవి ఉద్యోగానికి అనర్హులుగా మార్చుతుంటాయి. శరీరంపై పచ్చబొట్లు ఉంటే రక్షణశాఖలో కొన్ని ఉద్యోగాలకు అనర్హులవుతారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. 

అయితే, ఒకసారి వేయించుకున్న పచ్చబొట్లను తొలగించుకోవాలంటే అందుకు చాలా ఖర్చవుతుంది. ఆ ఖర్చు భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారికి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి శుభవార్త చెప్పింది. పచ్చబొట్టును తొలగించుకోవాలనుకునే వారికి ఇక్కడ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే అనేకమందికి పచ్చబొట్లు తొలగించామని, అవసరమైన వారు తమను సంప్రదించాలని ఆసుపత్రి సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.

డెర్మ్ఎబ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా లోపలి వరకు చర్మాన్ని తొలగించి పచ్చబొట్టును శాశ్వతంగా మాయం చేస్తారు. చర్మాన్ని తొలగించిన ఆ తర్వాత ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకు అక్కడ లేజర్ చికిత్స చేస్తారు. సాధారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో ఈ చికిత్సకు లక్ష రూపాయలకు పైనే ఖర్చవుతుందని డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. టాటూలు, పచ్చబొట్లు వేయించుకోవద్దని, వాటి కోసం వాడే సూదులు శుభ్రంగా లేకపోతే రక్తం ద్వారా ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

More Telugu News