Chandrababu: ఎక్కడో కశ్మీర్ లో వినిపించే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం: చంద్రబాబు

  • కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ ను పునరుద్ధరించలేదన్న చంద్రబాబు 
  • ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శ 
  • ఇంటర్నెట్ ఇప్పుడు సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయిందంటూ వ్యాఖ్య 
Chandrababu demands to provide internet services in Konaseema

కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవల నిలిపివేత' అనే వార్తను మనం మన సీమలో వినాల్సి రావడం బాధాకరమని చెప్పారు. 

ఐటీ వంటి ఉద్యోగాలను ఇవ్వలేని ఈ ప్రభుత్వం... కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని అన్నారు. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా ఇంటర్నెట్ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదని అన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత ప్రజలకు ఇబ్బందిగా మారకూడదని చెప్పారు.

More Telugu News