Sidhu Moosewala: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కాల్చివేత

  • మాన్సా జిల్లాలో ఘటన
  • థార్ వాహనంలో వెళుతున్న శుభదీప్
  • ఒక్కసారిగా కాల్పులు
  • ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి
  • ఇటీవల శుభదీప్ కు భద్రత తొలగించిన ప్రభుత్వం
Singer and Congress leader Sidhu Moosewala killed in Punjab

పంజాబ్ లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహార్కె గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్ పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, వారికి ప్రాథమిక చికిత్స అనంతరం, పెద్దాసుపత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన థార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 

శుభదీప్ వయసు 28 ఏళ్లు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం 424 మందికి పోలీసు భద్రతను తొలగించింది. వారిలో శుభదీప్ కూడా ఉన్నారు. శుభదీప్ కు భద్రత తొలగించిన కొన్నిరోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. త్వరలోనే సీఎం భగవంత్ మాన్ ను కలిసి తన భద్రత పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని శుభదీప్ విజ్ఞప్తి చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.

శుభదీప్ కు పంజాబ్ లో భారీగా అభిమానులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. కాగా, శుభదీప్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News