Trump: గన్ లాబీకి మద్దతుగా ట్రంప్.. బైడెన్ సర్కారు పై విమర్శలు

  • ఉక్రెయిన్ కు నిధులు పంపే బదులు పాఠశాలల్లో భద్రత కల్పించండన్న ట్రంప్ 
  • ఇతర ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ముందు ఇది చేయాలంటూ సూచన 
  • ఉక్రెయిన్ యుద్ధమే ప్రాధాన్యంగా మారిపోయిందని విమర్శ
Trump backs gun lobby targets Biden If US has 40 bn to send to Ukraine

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఎవాల్డేలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల బాలుడు తుపాకీతో మారణ హోమం సృష్టించి 21 మందిని బలి తీసుకోవడం గుర్తుండే ఉంటుంది. గన్ సంస్కృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాకు ఈ తూటాల తలనొప్పి ఎంత కాలం? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. గన్ వినియోగదారులకు మద్దతు పలుకుతూ జోబైడెన్ సర్కారును ఏకిపారేశారు. 

హూస్టన్ లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) వార్షిక సమావేశం జరిగింది. దీనికి ట్రంప్ హాజరై మాట్లాడారు. దేశంలోని స్కూళ్ల భద్రత కంటే ఉక్రెయిన్ యుద్ధమే బైడెన్ సర్కారుకు ప్రాధాన్యంగా మారిందని విమర్శించారు. పాఠశాలల్లో భద్రతపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు. 

‘‘యూఎస్ 40 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ కు పంపిస్తోంది. మన పిల్లలను భద్రంగా కాపాడుకునేందుకు మనం ఏమైనా చేయగలగాలి. ఇరాక్, ఆప్ఘానిస్థాన్ లో మనం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశాం. అందుకు మనకు ఒరిగిందేమీ లేదు. మిగిలిన ప్రపంచాన్ని, దేశాలను నిర్మించే ముందు.. సొంత దేశంలో మన పిల్లలకు సురక్షితమైన పాఠశాలలను నిర్మించాల్సి ఉంది’’ అని ట్రంప్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

సామూహిక హననానికి పాల్పడే ఘటనలను చూసి.. శాంతి, చట్టానికి కట్టుబడి ఉండే లక్షలాది మంది ప్రజలను (గన్ వినియోగదారులు) నిందించడం సరికాదని ట్రంప్ అన్నారు. ఎన్ఆర్ఏ అన్నది యూఎస్ లో గన్నుల యజమానుల అతిపెద్ద సంఘం. గన్నులను నియంత్రించే చర్యలకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తుంటుంది. రష్యాతో ఢీకొడుతున్న ఉక్రెయిన్ కు 45 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించే ప్రతిపాదనకు యూఎస్ ఇటీవలే ఆమోదం తెలపడం గమనించాలి.

More Telugu News