ISB: ఐఎస్‌బీపై చంద్ర‌బాబు ట్వీట్ల‌పై ప్ర‌శంస‌ల హోరు!

  • ఐఎస్‌బీ 20వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా చంద్ర‌బాబు ట్వీట్లు
  • #ThankYouCBNForISB హ్యాష్‌ట్యాగ్‌తో చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు
  • ఈ త‌రం పొలిటీషియ‌న్లు చంద్ర‌బాబులా చేయాలంటూ సూచనలు 
netizens applause on chandrababus tweets on isb

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గురువారం మ‌ధ్యాహ్నం వ‌రుస‌గా చేసిన ట్వీట్ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంసలు కురుస్తున్నాయి. ఐఎస్‌బీని ఎక్క‌డ నెల‌కొల్పాలన్న విష‌యంపై స‌మాలోచ‌న‌లు చేస్తున్న ఆ సంస్థ డైరెక్ట‌ర్ల బోర్డును తాను హైద‌రాబాద్‌లోనే ఆ సంస్థ‌ను ఏర్పాటు చేసేలా ఒప్పించిన తీరుపై చంద్ర‌బాబు ఏకంగా వ‌రుస‌బెట్టి 17 ట్వీట్ల‌ను పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు ట్వీట్ల‌పై తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారే కాకుండా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. #ThankYouCBNForISB పేరిట ట్విట్ట‌ర్ వేదిక‌గా హ్యాష్‌ట్యాగ్ పెట్టి మ‌రీ నెటిజ‌న్లు చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నాయకులు చంద్ర‌బాబు మాదిరిగానే త‌మ త‌మ ప్రాంతాల‌కు మంచి జ‌రిగేలా చూస్తే బాగుంటుంద‌న్న కోణంలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. ఇక చంద్ర‌బాబు కార‌ణంగా త‌మ ప్రాంతానికి రావాల్సిన ఐఎస్‌బీ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయింద‌ని ముంబై, బెంగ‌ళూరుకు చెందిన వారు ట్వీట్లు చేస్తూనే... ఐఎస్‌బీతో చంద్ర‌బాబు హైద‌రాబాద్ రూపు రేఖ‌లే మార్చేశారంటూ ప్ర‌శంసిస్తున్నారు.

More Telugu News