NCBN: ఐఎస్‌బీ మ‌ధుర జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు

  • 2001 డిసెంబ‌ర్ 2న ఐఎస్‌బీని ప్రారంభించిన వాజ్‌పేయి
  • ఐఎస్‌బీని హైద‌రాబాద్‌కు రప్పించేందుకు ముమ్మ‌ర య‌త్నాలు చేశానన్న చంద్రబాబు 
  • పారిశ్రామిక దిగ్గ‌జాల‌కు స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించానని వెల్లడి 
  • సీఎం హోదాను మ‌రిచి వారితో క‌లిసిపోయానని వ్యాఖ్య 
  • ఇత‌ర న‌గ‌రాల కంటే హైద‌రాబాదే బెట‌ర‌ని ఒప్పించాన‌న్న చంద్ర‌బాబు
chandrababu remembers isb inauguration in hyderabad

హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్ర‌స్తుతం 20వ వార్షికోత్స‌వాన్ని జరుపుకుంటోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ వేడు‌క‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఐఎస్‌బీకి సంబంధించిన మ‌ధుర స్మృతుల‌ను నెమ‌రు వేసుకుంటూ చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస‌గా 17 ట్వీట్లు పోస్ట్ చేశారు. 

ఐఎస్‌బీని హైద‌రాబాద్‌కు రాబ‌ట్టే క్ర‌మంలో తాను ఏమేం చేశాన‌న్న విష‌యాల‌ను చంద్ర‌బాబు స‌వివ‌రంగా స‌ద‌రు ట్వీట్ల‌లో వివ‌రించారు. గ‌చ్చిబౌలిని ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్‌గా మార్చే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న స‌మయంలోనే త‌న మ‌దిలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఓ బిజినెస్ స్కూల్ అక్క‌డ ఏర్పాటైతే గ‌చ్చిబౌలి రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని భావించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఈ క్ర‌మంలోనే దేశంలోని పారిశ్రామిక దిగ్గ‌జాలంతా క‌లిసి ఓ అత్యున్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేయాల‌నుకుంటున్నార‌ని, అందులో భాగంగా దాని పేరును ఐఎస్‌బీగా పెట్టార‌ని, దానికి డైరెక్ట‌ర్ల బోర్డు కూడా ఏర్పాటైపోయింద‌న్న విష‌యం తెలిసింద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. 
అప్ప‌టికే అభివృద్ధి ప‌రంగా హైద‌రాబాద్ కంటే ముందు ఉన్న ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా న‌గ‌రాల్లో దేనిలో ఐఎస్‌బీ పెట్టాల‌న్న విష‌యంపై పారిశ్రామిక దిగ్గ‌జాలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న స‌మ‌యంలో వారి ముందు హైద‌రాబాద్ ప్ర‌తిపాద‌న వ‌చ్చేలా చేశాన‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇందుకోసం తాను సీఎంని అన్న విష‌యాన్ని మ‌రిచి పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో క‌లిసిపోయాన‌ని, వారికి తానే స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించాన‌ని ఆయ‌న వివ‌రించారు. 

ఈ క్ర‌మంలో ముంబై, బెంగ‌ళూరు కంటే హైద‌రాబాద్ ఎందుకు బెట‌ర్ అన్న విష‌యాన్ని వారికి వివ‌రించి...చివ‌ర‌కు వారిని ఒప్పించాన‌ని చంద్ర‌బాబు తెలిపారు. సుదీర్ఘ క‌స‌ర‌త్తుల‌తో జ‌రిగిన ఈ య‌త్నాల‌న్నీ ఫ‌లించి ఐఎస్‌బీ ఏపీ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా... 2001 డిసెంబ‌ర్ 2న నాటి ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఐఎస్‌బీని ప్రారంభించార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. 

ఐఎస్‌బీ రాక‌ముందు గ‌చ్చిబౌలి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అన్న ఫొటోల‌తో పాటు ఐఎస్‌బీ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన‌ వాజ్‌పేయితో తాను క‌లిసి ఉన్న ఫొటోల‌ను కూడా చంద్ర‌బాబు త‌న ట్వీట్ల‌కు జ‌త చేశారు.
.

More Telugu News