KL Rahul: మేము బాదడానికి అవకాశం ఎక్కడిది..? : కేఎల్ రాహుల్

  • మధ్య ఓవర్లలో అద్భుతంగా బాల్ వేశారన్న లక్నో కెప్టెన్
  • ఆర్సీబీ పటీదార్ ప్రదర్శన ఫలితాన్ని మార్చేసిందని విశ్లేషణ
  • తాము క్యాచ్ లు పట్టుకోకపోవడం కొంప ముంచినట్టు వెల్లడి
KL Rahul after Lucknow gets knocked out Patidar knock was the difference between the teams

ఎలిమినేషన్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓటమి పాలై ఇంటి బాట పట్టిన లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ ఆట తీరును సమర్థించుకున్నాడు. ఓటమికి కారణాలను కూడా ఆయన వివరించాడు. వచ్చే సీజన్ కు మరింత బలంగా వస్తామని ప్రకటించాడు.

‘‘రెండు జట్ల మధ్య వ్యత్యాసం పటీదార్ ప్రదర్శన. టాప్ ఎండ్ నుంచి ఒక ఆటగాడు ఈ స్థాయిలో రెచ్చిపోతే ఆ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని రాహుల్ వివరించాడు. ఈ సీజన్ లో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ తిరిగొస్తామని చెప్పాడు. 

‘‘ఇది కొత్త ఫ్రాంచైజీ. మేము ఎన్నో తప్పులు చేశాం. వాటి నుంచి నేర్చుకుని బలంగా తిరిగి రావాల్సి ఉంది. మాది యువ జట్టు. మోహిసిన్ ఖాన్ తాను ఎంత ఉత్తమ బౌలరో అందరికీ తెలియజేశాడు. ఇది అతడికి మొదటి సీజన్. దీన్నుంచి విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇంటికి వెళ్లి కష్టపడి పనిచేయాలి. అతడు వచ్చే ఏడాది మరింత స్పీడుతో, మెరుగ్గా బౌలింగ్ చేయగలడు’’ అని రాహుల్ వివరించాడు.

208 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాము అనుసరించిన విధానాన్ని రాహుల్ సమర్థించుకున్నాడు. చివరికి 15 పరుగుల తేడాతో లక్నో ఓటమి చవిచూసింది. మధ్య ఓవర్లలో గట్టిగా బాది ఉంటే విజయం వరించేదంటూ విమర్శలు వస్తుండడంతో రాహుల్ స్పందించాడు.

 ‘‘మేము మధ్య ఓవర్లలో ఫోర్, సిక్సర్లు బాదడానికి ప్రయత్నించలేదని చెప్పడం సరికాదు. మేము ప్రయత్నించాం కానీ, మధ్య ఓవర్లలో వారు చక్కగా బౌలింగ్ చేశారు. హర్షల్ పటేల్ 10, 12వ ఓవర్ ను చాలా చక్కగా వేశాడు. కేవలం 7, 8 పరుగులే ఇచ్చాడు’’ అని రాహుల్ తెలిపాడు. 

తాము దినేష్ కార్తీక్, రజత్ పటీదార్ క్యాచ్ లను మిస్ చేసినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు వివరించాడు. ‘‘పటీదార్ 60-70 దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ మిస్ చేశాం. దీంతో అదనంగా 30-40 పరుగులు నష్టపోయాం. దినేష్ కార్తీక్ సింగిల్ డిజిట్ స్కోరులో ఉన్నప్పుడే అతడి క్యాచ్ ను కోల్పోయాం. మేము లక్ష్య సాధనకు మా సామర్థ్యాల మేరకు చాలా కష్టపడ్డాం’’ అని రాహుల్ వివరించాడు.

More Telugu News