Cricket: ఐపీఎల్ లోకి ఏబీ డివిలియర్స్ పునరాగమనం

  • వచ్చే ఏడాది సీజన్ కల్లా వస్తానన్న ఏబీ 
  • పూర్తిస్థాయి నిర్ణయం జరగలేదని కామెంట్
  • తన పునరాగమనంపై స్నేహితుడు విరాట్ చెప్పడం సంతోషమన్న ఏబీ 
AB Divilliers To Get Re entered into IPL Next Year

ఏబీ డివిలియర్స్.. మిస్టర్ 360గా బౌలర్లకు చుక్కలు చూపించే ఈ స్టార్ బ్యాటర్ ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కూ గుడ్ బై చెప్పేశాడు. అయితే, ఐపీఎల్ లో పునరాగమనంపై అతడిప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. క్రికెట్ ఫ్యాన్స్ ను జోష్ లో ముంచెత్తాడు. 

వచ్చే ఏడాది ఐపీఎల్ లో తాను రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే, ఏ స్థాయిలో వస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని వెల్లడించాడు. తన స్నేహితుడు విరాట్ ఈ విషయాన్ని ధ్రువీకరించడం సంతోషం కలిగించే విషయమన్నాడు. నిజం చెప్పాలంటే, ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి నిర్ణయం కాలేదన్నాడు. 

‘‘బెంగళూరులో వచ్చే ఏడాది మ్యాచ్ లుంటాయని లిటిల్ బర్డ్ ట్వీట్ చేసినట్టు విన్నాను. నా రెండో హోం టౌన్ కు తిరిగొచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చిన్నస్వామి స్టేడియం పూర్తిగా నిండి పూర్తిస్థాయి ప్రేక్షక సామర్థ్యం మధ్య జరిగే మ్యాచ్ ను చూసేందుకు ఎదురుచూస్తున్నా. పునరాగమనం కోసం ఆసక్తిగా ఉన్నా’’ అని వెల్లడించాడు. 

కాగా, డివిలియర్స్ పునరాగమనంపై అంతకుముందు విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. వచ్చే ఏడాది డివిలియర్స్ రీ ఎంట్రీ ఇస్తాడని అన్నాడు. తాను అతడితో నిత్యం మాట్లాడుతున్నానని, టచ్ లోనే ఉన్నానని పేర్కొన్నాడు. తనకు అతడు ఎప్పుడూ మెసేజ్ చేస్తుంటాడని చెప్పాడు. ఇటీవల యూఎస్ కు వెళ్లిన డివిలియర్స్.. తన ఫ్యామిలీతో కలిసి అగస్టా మాస్టర్స్ అనే గోల్ఫ్ టోర్నీని చూశాడని పేర్కొన్నాడు. ఆర్సీబీ గేమ్స్ ను అతడూ చాలా క్లోజ్ గా పరిశీలిస్తున్నాడని, వచ్చే ఏడాది సీజన్ కు అతడు అందుబాటులో ఉంటాడని కోహ్లీ చెప్పాడు.

More Telugu News