Pawan Kalyan: అమలాపురం ఉద్రిక్తతలపై హోంమంత్రి జనసేన పేరెత్తడం సరికాదు: పవన్ కల్యాణ్ 

  • కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ జిల్లాగా మార్పు
  • ఆందోళన చేపట్టిన కోనసీమ జిల్లా సాధన సమితి
  • అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు
  • టీడీపీ, జనసేనల హస్తం ఉందన్న హోంమంత్రి
  • మంత్రి ఆరోపణలను ఖండించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan condemns home minister allegations on Janasena

కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి నేతృత్వంలో భారీ సంఖ్యలో నిరసనకారులు అమలాపురంలో కదంతొక్కారు. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల నివాసాలకు నిప్పు పెట్టారు. అంతకుముందు, పోలీసుల వాహనాలపైనా రాళ్లు రువ్వి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. 

ఈ పరిణామాలపట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి అంటూ హోంమంత్రికి హితవు పలికారు.

అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలను సృష్టిస్తున్నారని, పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని విమర్శించారు.

అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని హితవు పలికారు. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్రబిందువుగా మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

More Telugu News