Russia: నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని కాల్చి చంపిన రష్యన్ సైనికుడికి జీవితకాల జైలు శిక్ష

  • యుద్ధం ప్రారంభమైన నాలుగో రోజే ఘటన
  • కారును దొంగిలించేందుకు 62 ఏళ్ల వృద్ధుడిని కాల్చేసిన సైనికుడు
  • కోర్టులో నేరాన్ని అంగీకరించిన రష్యా సైనికుడు
  • యుద్ధ నేరాలపై వెలువడిన తొలి తీర్పు ఇదే
 Russian soldier Vadim Shishimarin jailed for life over war crime

రష్యన్ సైనికుడు ఒకరికి ఉక్రెయిన్ కోర్టు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని ఎలాంటి కారణం లేకుండా కాల్చి చంపినందుకు గాను అతడికీ శిక్ష విధిస్తూ ఉక్రెయిన్ డిస్ట్రిక్ట్ కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలి రోజుల్లో జరిగిన నేరాలపై ట్రయల్స్‌లో భాగంగా వెలువడిన తొలి తీర్పు ఇదే. 

రష్యా సైన్యంలో ట్యాంక్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న 21 ఏళ్ల సెర్గియెంట్ వదిమ్ షిషిమరిన్ ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రెయిన్‌లోని చుపఖివ్కా గ్రామంలో 62 ఏళ్ల వృద్ధుడిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు ఉక్రెయిన్ సైన్యానికి చిక్కాడు.

ఉక్రెయిన్ బలగాలు వెంబడిస్తుండడంతో నలుగురు రష్యా సైనికులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారును దొంగిలించేందుకు వృద్ధుడిని కాల్చి చంపారు. ఆ నలుగురిలో సెర్గియెంట్ కూడా ఉన్నాడని, అతడే ఆ వృద్ధుడిని కాల్చి చంపాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

అయితే, తనంత తానుగా కాల్చలేదని, కాల్చివేయాలన్న ఆదేశాలతోనే కాల్పులు జరిపినట్టు అతడు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

More Telugu News