SBI users: ఎస్బీఐ ఖాతాదారులూ.. ఇలాంటి మెస్సేజ్ ల పట్ల జాగ్రత్త..!

  • ఖాతా బ్లాక్ అయిందంటూ ఎస్ఎంఎస్, మెయిల్స్
  • వాటితో పాటు వచ్చే లింక్స్ ను నమ్మొద్దన్న పీఐబీ 
  • ఈ తరహ ఎస్ఎంఎస్ లు, కాల్స్ కు స్పందించొద్దని సూచన  
Government warning SBI users to delete this message immediately or lose money

‘మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయడం జరిగింది’ అంటూ మొబైల్ కు మెస్సేజ్ వచ్చిందా..? అయితే, దాన్ని పట్టించుకోవద్దు. ఖాతాదారులకు ఎస్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఇదే సూచిస్తోంది. సైబర్ నేరస్థులు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వేల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు తరచూ ఈ విధమైన హెచ్చరికలు, సూచనలు చేస్తూనే వస్తోంది. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నుంచి ఒక ప్రకటన విడుదలైంది. 'ఖాతా బ్లాక్ చేశామంటూ స్కామర్లు ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు. ఈ తరహ ఎస్ఎంఎస్ లు, కాల్స్ కు స్పందించొద్దని' ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. అలాగే, వచ్చిన ఎస్ఎంఎస్ లోని లింక్ పైనా క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.

‘‘వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల సమాచారం కోరుతూ వచ్చే మెయిల్స్, ఎస్ఎంఎస్ లకు స్పందించొద్దు. ఈ తరహా ఏవైనా మెయిల్స్, ఎస్ఎంఎస్ లు వస్తే ఖాతాదారులు.. report.phishing @sbi.co.in  కు తెలియజేయాలి’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సూచించింది. లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేషన్ అవుతుందన్న సమాచారాన్ని కూడా నమ్మొద్దని పేర్కొంది.

More Telugu News