Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీని ఎత్తివేసిన ప్రభుత్వం

  • గత రెండు వారాలుగా శ్రీలంకలో అత్యవసర పరిస్థితి
  • తీవ్రస్థాయిలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం
  • దేశంలో హింసాత్మక సంఘటనలు
  • ప్రస్తుతం కాస్త మెరుగుపడిన శాంతిభద్రతలు
Sri Lanka govt lifts emergency

ప్రజలకు నిత్యావసరాలు కూడా అందించలేని దయనీయ స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు వారాలుగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నేడు ప్రకటించింది. 

తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో శ్రీలంక సర్కారు అత్యవసర పరిస్థితిని విధించడం తెలిసిందే. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మే 6 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీని విధించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులకు విశేష అధికారాలు కల్పించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు కొద్ది మేర మెరుగయ్యాయని, దేశంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక 'హిరు న్యూస్' మీడియా వెల్లడించింది. 

శ్రీలంకలో ఇప్పటివరకు చోటుచేసుకున్న అల్లర్లలో 9 మంది మరణించగా, 200 మంది వరకు గాయపడ్డారు.

More Telugu News