Anand Mahindra: నిఖత్ జరీన్ కు ప్రధాని మోదీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

  • మన బాక్సర్లు గర్వపడేలా చేస్తున్నారన్న ప్రధాని
  • ముగ్గురు మహిళా బాక్సర్లకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు
  • ప్రపంచానికి భారత్ అంటే ఏంటో చెప్పావంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
PM Anand Mahindra congratulates Nikhat Zareen after her historic gold for India at Womens World Boxing Championship

హైదరాబాదీ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా అవతరించడం పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇస్తాంబుల్ లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో జరీన్ విజేతగా నిలవడం గమనార్హం.

‘‘మన బాక్సర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు. అలాగే, కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్, పర్వీన్ హూడాకు సైతం అభినందనలు’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు. ‘‘భారత బాక్సర్. ప్రపంచ ఛాంపియన్. 5-0 తేడాతో విజయం. థాంక్యూ నిఖత్ జరీన్ ప్రపంచానికి నీవు అంటే ఏంటో, భారత్ అంటే ఏంటో తెలియజేశావు. నిన్ను ఎవరూ ఆపలేరు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇదిలావుంచితే, బాక్సింగ్ లో పతకం గెలుచుకున్న ఐదో భారత క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ గుర్తింపు సాధించింది. మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ గతంలో పతకాలు గెలిచినవారే.

More Telugu News