Madhavan: సినిమా వాళ్ల కంటే సుందర్ పిచాయ్ కే ఫ్యాన్స్ ఎక్కువ: సినీ హీరో మాధవన్

  • కొనసాగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్
  • నేడు మాధవన్ నటించిన కొత్త చిత్రం ప్రదర్శన
  • 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' చిత్రంలో నటించిన మాధవన్
  • దర్శకత్వం కూడా చేపట్టిన మ్యాడీ
Madhavan says Sundar Pichai have more fans than cine people

ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ ఏడాది కూడా భారతీయ చిత్రాలు సందడి చేస్తున్నాయి. నటుడు మాధవన్ స్వీయదర్శకత్వంలో నటించిన 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' చిత్రం కూడా కేన్స్ లో ప్రదర్శితం కానుంది. ఈ చిత్రం  ప్రీమియర్ షో  నేడు కేన్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా కేన్స్ లో తన చిత్రానికి ప్రచారం నిర్వహిస్తున్న నటుడు మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద తెరకెక్కించదగిన ఎన్నో కథలు ఉన్నాయని వెల్లడించారు. 

నాటి ఆర్యభట్ట నుంచి నేటి సుందర్ పిచాయ్ వరకు ప్రతిదీ సినిమా కథకు అర్హమేనని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అద్భుతగాథలు భారత్ లో ఉన్నాయని, అయితే అలాంటివారిపై సినిమాలేవీ రావడంలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు వారు స్ఫూర్తి ప్రదాతలు అని మాధవన్ పేర్కొన్నారు. సుందర్ పిచాయ్ వంటి వ్యక్తులకు సినిమా వాళ్ల కంటే ఎక్కువమంది అభిమానులు ఉంటారని వ్యాఖ్యానించారు. 

కాగా, మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' ఓ రియల్ లైఫ్ స్టోరీ. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితగాథను ఇందులో చూపించారు. 

ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన నారాయణపై 1994లో అంతర్గత గూఢచర్యానికి సంబంధించిన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో ఉద్యోగం కోల్పోయిన ఆయన ఎన్నో అవమానాలకు గురయ్యారు. మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళతో ఆయనకు సంబంధం అంటగట్టారు. అప్పటికి ఆయన కీలకమైన క్రయోజనిక్ మిషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఎంతో విలువైన క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం పత్రాలను మరియం రషీదాకు అందించారన్నది ఆయనపై ప్రధాన అభియోగం. 

అయితే, 1998లో ఆయన నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ 2018లో కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, నంబి నారాయణన్ తన న్యాయపోరాటాన్ని అంతటితో ఆపలేదు. తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించింది ఎవరో బయటికి లాగాలంటూ పిటిషన్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఓ కమిటీ కూడా వేసింది. 

ఇప్పుడు ఆయన జీవిత కథలోని ఆసక్తికర అంశాల ఆధారంగానే మాధవన్ 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని రూపొందించారు. నటన, దర్శకత్వం మాత్రమే కాదు, చిత్రనిర్మాణంలో కూడా మాధవన్ పాలుపంచుకున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News