Sirivennela: పుస్తకరూపంలో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం

  • ఈ నెల 20న సిరివెన్నెల జయంతి
  • ఉత్సవాలు జరపనున్న తానా
  • హైదరాబాదు శిల్పకళావేదికలో కార్యక్రమం
  • తొలి సంపుటం ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
Sirivennela poetry will be available in books

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. మొత్తం 6 సంపుటాల్లో సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని ప్రజలకు అందించాలని తానా నిశ్చయించింది. సిరివెన్నెల సినీ గేయాలను 4 సంపుటాలు గానూ, ఇతర సాహిత్యాన్ని మరో 2 సంపుటాలు గానూ తీసుకురానున్నారు. 

ఈ నెల 20న సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి కాగా, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు హైదరాబాదు శిల్పకళావేదికలో జరగనున్నాయి. ఈ వేడుకలకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించనున్నారు. కాగా, సిరివెన్నెల సమగ్ర సాహిత్యంలోని తొలి సంపుటాన్ని ఈ నెల 20న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆవిష్కరించనున్నారు. 

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కృష్ణవంశీ, క్రిష్, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ,  భువనచంద్ర, అనంతశ్రీరామ్, సంగీత దర్శకులు కీరవాణి, తమన్, ఆర్పీ పట్నాయక్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొంటారు.  

సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యం కారణంగా గతేడాది నవంబరు 30న కన్నుమూశారు. మూడున్నర దశాబ్దాలకు పైగా సినీ గీత రచయితగా అనేక చిత్ర విజయాలకు దోహదపడ్డారు. ఆయన రాసిన కొన్ని పాటలు సినిమాకు సంబంధించినవే అయినా, సమాజాన్ని సూటిగా ప్రశ్నించేలా ఉండేవి. పద విన్యాసాల కంటే భావానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సిరివెన్నెల నేటితరం గీతరచయితలకు స్ఫూర్తిగా నిలిచారు.

More Telugu News