YSRCP: చిదంబ‌రం ఓ ఆర్థిక ఉగ్ర‌వాది.. త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయండి: వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

  • కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రంపై సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు
  • అరెస్ట్ చిదంబ‌రం పేరిట హ్యాష్‌ట్యాగ్ పెట్టిన వైసీపీ ఎంపీ
  • కేంద్ర మంత్రి హోదాలో అన్ని ర‌కాల నేరాలకు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ
ysrcpp leader vijay sai reddy harsh comments on p chidambaram

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రంపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌యసాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్ర‌వాదిగా అభివ‌ర్ణించిన సాయిరెడ్డి.. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా సాయిరెడ్డి వ‌రుస‌గా 5 ట్వీట్లు సంధించారు.

చిదంబ‌రం ఓ ఆర్థిక ఉగ్ర‌వాది అని పేర్కొన్న సాయిరెడ్డి... ఆయ‌నకు నైతిక‌తే లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ క‌ళాశాల‌లు చిదంబ‌రం వ్య‌వ‌హారాల‌ను కేస్ స్ట‌డీలుగా తీసుకోవాల‌ని సూచించారు. మ‌నీ ల్యాండ‌రింగ్ నుంచి చైనా పౌరుల‌కు లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించార‌ని చిదంబ‌రంపై సాయిరెడ్డి మ‌రింత ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబ‌రం ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయన ఆరోపించారు. 

తాను చేసిన అన్ని త‌ప్పుల‌కు చిదంబ‌రం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన స‌మయం ఆస‌న్న‌మైంద‌ని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. త‌క్ష‌ణ‌మే చిదంబ‌రంను అరెస్ట్ చేయాల‌ని ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా పోస్ట్ చేసిన సాయిరెడ్డి... 2004- 14 మ‌ధ్య‌లో కేంద్ర మంత్రి హోదాలో చిదంబ‌రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాలు, వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. 

త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై త‌ప్పుడు కేసులు పెట్టించిన చిదంబ‌రం అత్యంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించార‌ని సాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అంతా తారుమారైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చిదంబ‌రం విత్తిన పాపం ఇప్పుడు ఫ‌లాలు ఇస్తోంద‌ని కూడా సాయిరెడ్డి సెటైర్ సంధించారు. జాతి వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డ్డ చిదంబ‌రం కోట్లాది ధ‌నాన్ని సంపాదించార‌ని ఆయ‌న ఆరోపించారు.

చిదంబ‌రంను జాతి వ్య‌తిరేకిగా అభివ‌ర్ణించిన సాయిరెడ్డి.. ఇన్ని నేరాల‌కు పాల్ప‌డ్డ చిదంబ‌రం ఆర్థిక‌, రాజ‌కీయ అంశాల‌పై ధైర్యంగా ఉప‌న్యాసాలు ఇచ్చిన వైనం ఇప్ప‌టిదాకా త‌న‌కు అర్థ‌మే కాలేద‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీల‌కు పాల్ప‌డ్డార‌ని చిదంబ‌రంపై ఆయన విరుచుకుప‌డ్డారు. చిదంబ‌రం పాల్ప‌డ్డ అక్ర‌మాల కార‌ణంగా స‌ర్కారీ ఖ‌జానాకు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని ఆరోపించారు. ధ‌నికుల కోసం పేద‌ల‌ను ద‌రిద్రంలో కూరుకుపోయేలా చిదంబ‌రం వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. దేశంలో నాడు స్కాంల‌కు పాల్ప‌డ్డ అంద‌రితోనూ చిదంబ‌రం ఒప్పందాలు కుదుర్చున్నార‌ని కూడా సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ చేశారు.

More Telugu News