Currency: జీతాలు చెల్లించేందుకు భారీగా కరెన్సీ నోట్లు ముద్రించాలని శ్రీలంక సర్కారు నిర్ణయం!

  • శ్రీలంకలో అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభం
  • గత కొన్ని నెలలుగా దేశంలో అస్థిరత
  • ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు 
  • నోట్లు ముద్రించాలని సాహసోపేత నిర్ణయం
Sri Lanka govt set to print currency

శ్రీలంకలో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్ విక్రమసింఘే ముందు పెను సవాళ్లు నిలిచాయి. వాటిలో ముఖ్యమైనది... ఉద్యోగులకు జీతాలు చెల్లించడం. కాగితాలపై గణాంకాలు కనిపిస్తున్నాయే తప్ప ఖజానాలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో శ్రీలంక సర్కారు సాహసోపేతమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 

దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కొత్తగా కరెన్సీ నోట్లు ముద్రించక తప్పడంలేదని ప్రధాని రణిల్ విక్రమసింఘే తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2021లో శ్రీలంక 1.2 ట్రిలియన్ శ్రీలంక రూపీలను ముద్రించింది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ 588 బిలియన్ రూపీలను ముద్రించింది. 2019 డిసెంబరు నుంచి 2021 ఆగస్టు మధ్యన శ్రీలంక ద్రవ్య సరఫరా 42 శాతానికి పెరిగింది. 

కరెన్సీ ముద్రణ నిర్ణయాన్ని గత ప్రభుత్వం సమర్థించుకుంది. ద్రవ్యలోటును భర్తీ చేయడానికి, పన్నురేట్లను తగ్గుస్థాయిలో ఉంచడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. అయితే, ప్రముఖ ఆర్థికవేత్తలు మాత్రం ఇదొక వెర్రి ఆలోచన అని విమర్శించారు. ఇది సిద్ధాంతపరంగా బాగుంటుందేమో కానీ, ఆచరణాత్మక రీతిలో వెళ్లకపోవడమే మంచిదని అప్పట్లోనే హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో, విక్రమసింఘే ప్రభుత్వం కూడా కరెన్సీ ముద్రణకు పూనుకోవడం మరింత ఆందోళనలు కలిగిస్తోంది. తాత్కాలికంగా నగదు లభ్యత ఉన్నా, ద్రవ్యోల్బణం మరింత అదుపు తప్పడం ఖాయమని, తద్వారా దేశం పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News