Ajinkya Rahane: గాయంతో ఐపీఎల్ తాజా సీజన్ మొత్తానికి దూరమైన అజింక్యా రహానే

  • కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానే
  • రహానేకి తొడ కండరాల గాయం
  • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఇబ్బందిపడిన వైనం
  • రహానే ఈ సీజన్ లో ఆడబోవడంలేదన్న ఫ్రాంచైజీ
Ajinkya Rahane out of IPL due to Hamstring injury

సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే గాయంతో ఐపీఎల్ తాజా సీజన్ కు దూరమయ్యాడు. రహానే ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి ఏమంత గొప్పగా రాణించని రహానే తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో మిగతా మ్యాచ్ ల్లో ఆడలేని పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో, రహానే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు రహానేతో జట్టు అనుబంధాన్ని వివరిస్తూ కేకేఆర్ ఓ వీడియో కూడా పంచుకుంది. రహానేను తప్పకుండా మిస్సవుతామని విచారం వ్యక్తం చేసింది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా రహానే గాయంతో బాగా ఇబ్బందిపడ్డాడు. ఆ మ్యాచ్ లో 24 బంతుల్లో 3 సిక్స్ ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఆ పోరులో సింగిల్స్ తీసే సమయంలో చాలా అసౌకర్యంగా కదులుతూ కనిపించాడు. ఏమైనా, ఈ సీజన్ రహానేకు ఏమంత కలిసిరాలేదనే చెప్పాలి. 7 మ్యాచ్ ల్లో కేవలం 133 పరుగులు చేశాడు. సగటు 19.00 మాత్రమే. 

ఈ టోర్నీలో కోల్ కతా జట్టు తొలి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడగా, ఆ మ్యాచ్ లో కాస్త ఫరవాలేదనిపించాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ ల్లో వరుసగా 9, 12, 7, 8 పరుగులు చేసి విమర్శలకు గురయ్యాడు. 

కాగా, రహానే గాయం తీవ్రత దృష్ట్యా... రంజీ ట్రోఫీ నాకౌట్ పోటీల్లో ఆడేది కూడా అనుమానంగా మారింది. రంజీ ట్రోఫీ నాకౌట్ దశ వచ్చే నెల 4న బెంగళూరులో ప్రారంభం కానుంది.

More Telugu News