Bharti Singh: గడ్డం, మీసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి భారతీ సింగ్ పై కేసు

  • గడ్డం, మీసాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న భారతి 
  • పాలు తాగుతూ గడ్డం వెంట్రుకలు నోట్లో పెట్టుకుంటే సేమియాలా ఉంటుందంటూ వ్యంగ్యం 
  • సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసు నమోదు
  • బేషరతుగా క్షమాపణలు చెప్పిన నటి
FIR lodged against comedian Bharti Singh over beard joke

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, కమెడియన్ భారతీ సింగ్ పై కేసు నమోదైంది. అయితే, ఆమె ఈ వ్యాఖ్యలు గతంలో చేసినవి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-ఎ కింద పంజాబ్ లోని అమృత్ సర్ లో భారతీ సింగ్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైంది. గడ్డం, మీసాలకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలను దెబ్బతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది.

‘‘గడ్డం, మీసాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాలు తాగుతూ గడ్డం వెంట్రుకలు కొన్నింటిని నోట్లోకి తీసుకుంటే అది సేవియాన్ (సేమియా) కంటే తక్కువ రుచి ఏమీ ఉండదు’’ అని భారతీ సింగ్ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అదే ఇప్పుడు కేసు దాఖలుకు దారితీసింది. సిక్కులు వారి మత ఆచారంలో భాగంగా పాటించే గడ్డాన్ని ఆమె అగౌరవపరిచినట్టు పలువురు విమర్శిస్తున్నారు. 

ఈ క్రమంలో భారతీ సింగ్ క్షమాపణలు కోరారు. ఏ మత మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘‘గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఒక వీడియో వ్యాప్తిలో ఉంది. నేను ఈ వీడియోలో ఏ మతం, కులానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఏ పంజాబీని ఎగతాళి చేయలేదు. నేను నా ఫ్రెండ్ తో సరదాగా కామెడీ చేశాను అంతే. ఒకవేళ ఏ వర్గాన్ని అయినా ఇది బాధకు గురి చేసి ఉంటే వారిని రెండు చేతులు ఎత్తి క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను కూడా పంజాబీనే. నాకు పంజాబ్ అంటే గౌరవం’’ అని భారతీ సింగ్ వివరణ ఇచ్చింది.

More Telugu News