Hardik Patel: రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ.. హార్దిక్ పటేల్ కీలక వ్యాఖ్యలు

  • పటీదార్ నేతలతో హార్దిక్ పటేల్ చర్చలు
  • కాంగ్రెస్ ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌కు హాజరు కాని హార్దిక్
  • ఆయన సంగతి అధిష్ఠానం చూసుకుంటుందన్న గుజరాత్ కాంగ్రెస్ చీఫ్
  • హార్దిక్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్న రాష్ట్ర మాజీ చీఫ్
Will decide future after meeting Rahul says Hardik Patel

కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ ఇటీవల నిరసన గళం విప్పిన గుజరాత్ కాంగ్రెస్ యువ నేత హార్దిక్ పటేల్ భవితవ్యం మరో రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది. ఇంకో రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు హార్దిక్ పటేల్ తెలిపారు. 

ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ హార్దిక్ కినుక వహించారు. పార్టీని బలోపేతం చేసే విషయంలో తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆయన పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది.

కాగా, ఈ నెల మొదట్లో గుజరాత్‌లో పర్యటించిన రాహుల్‌ను తాను కలుసుకున్నప్పటికీ ఆయనతో పూర్తిస్థాయిలో చర్చలు జరపలేకపోయానని హార్దిక్ తెలిపారు. తన రాజకీయ భవితవ్యం గురించి పటీదార్ నేతలు, ఖోదల్‌ధామ్ ట్రస్టీ నరేష్ పటేల్‌తో ఆదివారం చర్చించినట్టు చెప్పారు. పార్టీతో సంబంధం లేకుండా తాను అండగా ఉంటానని నరేష్ తనకు హామీ ఇచ్చారని అన్నారు. 

మరోవైపు, నరేష్ పటేల్ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని, బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శివిర్‌కు హాజరుకాకపోవడంపై హార్దిక్ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా అక్కడికి వెళ్లి ఏం చేయాలని ప్రశ్నించారు. పార్టీ కోసం తాము ఎంతో చేశామని, ప్రతిగా ఏమీ తీసుకోలేదని అన్నారు. 

హార్దిక్ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడడం లేదని, తన కలతకు కారణం ఏమిటో కూడా చెప్పడం లేదని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జగదీశ్ ఠాకూర్ అన్నారు. ఆయన విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆయన కాకుండా చర్చించుకునేందుకు తమకు చాలా విషయాలు ఉన్నాయని విస్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని, హార్దిక్ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని ఆ పార్టీ గుజరాత్ మాజీ చీఫ్ అర్జున్ మోద్వాడియా అన్నారు.

More Telugu News