Gyanvapi: జ్ఞానవాపి మసీదు ఆవరణలోని బావి సీజ్ చేయండి.. కోర్టు ఆదేశాలు

  • ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించొద్దన్న కోర్టు 
  • రక్షణ బాధ్యత కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ తీసుకోవాలని ఆదేశం 

Gyanvapi row UP court orders sealing of area surveyed amid Shivling claims

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణం మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని జిల్లా కోర్టు లోగడ ఆదేశించడం తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా జ్ఞానవాపి - శృంగార్ గౌరీ దేవి కాంప్లెక్స్ ఆవరణ బావిలో శివలింగాన్ని గుర్తించారు. దీన్ని పరిరక్షించాలని కోరుతూ సర్వేలో పాలు పంచుకున్న న్యాయవాద బృందంలో ఒకరు విష్ణు జైన్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘సంబంధిత ప్రాంతాన్ని సీజ్ చేయండి. ఏ ఒక్కరినీ అనుమతించొద్దు’’ అంటూ జిల్లా కలెక్టర్ కౌషల్ రాజ్ శర్మను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, సీఆర్పీఎఫ్ వారణాసి విభాగం సంబంధిత ప్రాంత భద్రత బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. 

కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు. ‘‘కోర్టు ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తాం. సర్వేకు పూర్తి సహకారం అందిస్తాం. కానీ, పిటిషనర్లతో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు ప్రకటనలు చేస్తుండడం, సర్వే వివరాలను లీక్ చేస్తుండడం ఎంతో బాధకు గురిచేస్తోంది’’ అని యాసీస్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినట్టు సర్వే సోమవారం ఉదయంతో ముగిసింది. 

మరోవైపు మసీదులో వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లోగడ కొట్టివేయడం తెలిసిందే. దీంతో సర్వేను యథావిధిగా నిర్వహించారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ మంగళవారం విచారణ నిర్వహించనుంది. 

More Telugu News