Vijayashanti: ఈ అంకెల గార‌డీకి తెలంగాణ ప్ర‌జలు త‌గిన జవాబు చెబుతారు: విజ‌య‌శాంతి

  • కేసీఆర్ స‌ర్కార్ భారీ బడ్జెట్‌ డొల్లతనం మరోసారి బయటపడిందన్న విజ‌య‌శాంతి
  • అంచనా వేసిన ఆదాయంలో మూడో వంతు కూడా రాలేదని వ్యాఖ్య‌
  • ఏకంగా రూ.50 వేల కోట్ల వరకూ ఆదాయం పడిపోయిందని విమ‌ర్శ‌
vijay shanti slams kcr

కేసీఆర్ ప్ర‌భుత్వంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమర్శ‌లు గుప్పించారు. ''కేసీఆర్ స‌ర్కార్ భారీ బడ్జెట్‌ డొల్లతనం మరోసారి బయటపడింది. అంచనా వేసిన ఆదాయంలో మూడో వంతు కూడా రాలేదు. ఏకంగా రూ.50 వేల కోట్ల వరకూ ఆదాయం పడిపోయింది. ఫలితంగా, బడ్జెట్‌లో అంచనా వేసినప్పటికీ దాదాపు రూ.32 వేల కోట్ల మేరకు ఖర్చు చేయలేని పరిస్థితి. 

వెరసి, బడ్జెట్లో కేసీఆర్ స‌ర్కార్ అంకెల గారడీ చేసింద‌ని.. కాగ్ కు సమర్పించిన నివేదిక ద్వారా మ‌రోసారి బట్టబయలైంది. ఏటా ఆకర్షణీయమైన అంకెలతో భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టడం... చివరికి ఆదాయం రాలేదంటూ లోటును చూపించడం టీఆర్ఎస్ సర్కారుకి పరిపాటిగా మారిపోయింది. 

గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల కింద 72.37 శాతం నిధులే సమకూరాయి. భూముల అమ్మకం తదితర పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లు వస్తాయని బడ్జెట్లో కేసీఆర్ ప్ర‌భుత్వం అంచనా వేసింది. కానీ, రూ.8,857.37 కోట్లు... అంటే 28.99 శాతం మాత్రమే సమకూరాయి. పన్నేతర రాబడుల కింద భారీగా చూపించడం... అందులో నాలుగో వంతు కూడా రాకపోవడం ఏటా జరుగుతున్న తంతే.

అయినా, బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచడానికి ఇదొక సాకుగా మారింది. భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పుకోవ‌డానికి ప్ర‌తి ఏటా కేసీఆర్ స‌ర్కార్ ఇలానే చేస్తుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టడం అది కాస్తా లోటు బ‌డ్జెట్ గా మార‌డం చూస్తుంటే... కేసీఆర్ సర్కారుకు బడ్జెట్ అనేది ఒక తంతుగా కనిపిస్తోంది తప్ప ఇది రాష్ట్రాభివృద్ధికి కీలకం అనే సోయి లేకుండా పోయింది. దీని వల్ల అనేక ప్ర‌జాసంక్షేమ‌ పథకాల‌కు దెబ్బ ప‌డుతోంది. కేసీఆర్ ఇకనైనా అంకెల గార‌డీని పక్కన పెట్టి వాస్తవ దృష్టితో చూడాలి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆడుతున్న ఈ అంకెల గార‌డీకి తెలంగాణ ప్ర‌జలు త‌గిన జవాబు చెబుతారు'' అని విజ‌య‌శాంతి ట్వీట్లు చేశారు. 

More Telugu News