RGV: ఎవరైనా నన్ను చంపడానికి వస్తే పారిపోను.. కత్తితో పొడిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదిస్తా: వర్మ

  • ఆనాటి పాత వర్మ ఎప్పుడో చచ్చిపోయాడన్న ఆర్జీవీ 
  • తాను ఎన్నికల్లో నిలబడినా బుద్ధి ఉన్నోళ్లెవరూ ఓటెయ్యరని వ్యాఖ్య 
  • ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని కామెంట్  
The Old Varma Dies Long Ago Says RGV

ఒకప్పుడు శివ, క్షణక్షణం, సత్య, అనగనగా ఒక రోజు, దెయ్యం వంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే, ఆ వర్మ ఎప్పుడో చచ్చిపోయాడని ఆయన అంటున్నారు. ప్రతి సినిమా తర్వాత మారిపోతానని చెబుతున్నారు. మెదడులో తట్టిన ఆలోచనల్నే కథలుగా మలుస్తానని అంటున్నారు. ఓ ప్రముఖ చానెల్ లో వచ్చిన షోలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎవరైనా తనను చంపడానికి వస్తే తాను పారిపోనని వర్మ చెప్పారు. వచ్చిన వ్యక్తి తనను కత్తితో పొడిస్తే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.  

దేశ పౌరుడిగా రాజ్యాంగంలో తనకున్న హక్కులేమిటో తెలుసని, వాటిని వాడుకుంటానని అన్నారు. ఎదుటి వాళ్లు బాధపడతారని మాట్లాడకుండా ఉంటే అసలు ఏం మాట్లాడలేమని అన్నారు. టికెట్ల ధరల పెంపు విషయంలో కేవలం ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని పేర్కొన్నారు. మనం చెప్పిన నిర్ణయం కొందరికి నచ్చుతుందని, ఇంకొందరికి నచ్చదని అన్నారు. 

తాను ఎన్నికల్లో నిలబడినా బుద్ధి ఉన్నోళ్లెవరూ తనకు ఓటెయ్యరని, తాను జనాల కోసం ఏమీ చేయనన్న విషయం వారికి బాగా తెలుసని అన్నారు. తన కోసం తాను బతుకుతున్నానని, రాజకీయ నాయకుల లక్షణం అది కాదని చెప్పారు. 

తనలాగా బతకాలంటే మూడు విషయాలను అలవరచుకోవాలన్నారు. దేవుడు, సమాజం, కుటుంబం వంటి వాటిని వదిలేయాలని, అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తన లాగా బతకవచ్చని వర్మ తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కశ్మీర్ ఫైల్స్ సినిమాలు తనకు బాగా నచ్చాయన్నారు. 

More Telugu News