Brendan Mccullum: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ గా కివీస్ డైనమైట్ బ్రెండన్ మెకల్లమ్

  • ఇటీవల ఇంగ్లండ్ కు దారుణ పరాజయాలు
  • బలహీన వెస్టిండీస్ చేతిలోనూ ఓడిన వైనం
  • తాజాగా పూర్తిస్థాయి కోచ్ నియామకం
Brendon Mccullum appointed as England test team head coach

ఇటీవల కాలంలో దారుణ పరాజయాలను ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త కోచ్ వచ్చాడు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. ఈ మేరకు ఈసీబీ ఓ ప్రకటన చేసింది. వెస్టిండీస్ టూర్ సమయంలో క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ కోచ్ గా తప్పుకోవడంతో మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్ వుడ్ తాత్కాలిక కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. వెస్టిండీస్ టూర్ తో కాలింగ్ వుడ్ బాధ్యతలు ముగిశాయి. 

ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో న్యూజిలాండ్ తో జరిగే మూడు టెస్టుల సిరీస్ తో బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ కోచ్ గా బాధ్యతలు చేపడతాడని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. మెకల్లమ్ ప్రస్తుతం భారత్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్ గా నియమితుడవడం పట్ల మెకల్లమ్ స్పందించాడు. ఈ నియామకం ఎంతో సంతోషం కలిగిస్తోందని, ఇంగ్లండ్ జట్టుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపాడు. 

ఇటీవల వెస్టిండీస్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన అనంతరం ఇంగ్లండ్ సారథిగా జో రూట్ తప్పుకోవడం తెలిసిందే. రూట్ రాజీనామా నేపథ్యంలో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను టెస్ట్ కెప్టెన్ గా నియమించారు. మెకల్లమ్ కోచ్ గా వస్తున్న నేపథ్యంలో, ఈ జోడీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. స్టోక్స్ సొంతగడ్డ న్యూజిలాండే. క్రికెట్ కోసం అతడు ఇంగ్లండ్ వచ్చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కోచ్, కెప్టెన్ ఇద్దరూ న్యూజిలాండర్లే కావడం విశేషం. అది కూడా తమ తొలి సిరీస్ న్యూజిలాండ్ తో ఆడుతుండడం ఆసక్తికర అంశం.

More Telugu News