Andhra Pradesh: చంద్రబాబు పొత్తుల గురించి.. ‘ఎలుగు–పులి’ కథ చెప్పిన విజయసాయి రెడ్డి

  • టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు
  • శ్రీలంకలోలాగా తిరగబడాలంటూ సందేశాలిస్తున్నారని విమర్శ 
  • బాదుడే బాదుడులో బాబునే జనం బాదుతున్నారని ఎద్దేవా  
Vijayasai Reddy Satires on Chandrababu Naidu

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలుగుబంటి–పులి కథను చెప్పుకొచ్చారు. ‘‘ఓసారి పులి తరిమితే చెట్టెక్కాడు బాబు. పైన ఎలుగుబంటి కనిపించింది. ‘నీకు గతంలో బాబు ద్రోహం చేశాడు.. కిందకు తోసెయ్’ అంటూ భల్లూకాన్ని కోరింది పులి. చంద్రబాబు విశ్వాసఘాతకుడని తెలుసు.. అయినా నా ఇంటికొచ్చాడు కాబట్టి హాని చేయనన్నది ఎలుగు’’ అని ట్వీట్ చేశారు. బాబుతో పొత్తు పెట్టుకుంటే జరిగేదిదేనంటూ వ్యాఖ్యానించారు. 

రాత్రి 10 గంటలకు కుప్పంలోని బోయినపల్లె గ్రామానికి చంద్రబాబు వెళ్లారని, సారు పిలుస్తున్నారంటూ నిద్రపోయిన జనాన్ని లేపి మరీ టీడీపీ నేతలు తీసుకొచ్చారని మరో ట్వీట్ లో సెటైర్ విసిరారు. వాళ్లొచ్చాక నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారంటూ బాబు ప్రశ్నించారని, శ్రీలంకలోలాగా ప్రజలు తిరగబడాలంటూ సందేశం ఇచ్చివచ్చారని అన్నారు. ఇదేం హింస బాబూ? అంటూ కామెంట్ చేశారు. 

తుక్కుతుక్కుగా ఓడి మూడేళ్లయినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. ‘ఉప్పు, కారం తినడం లేదా? ప్రభుత్వంపై ఎందుకు కోపం రావడం లేదు?’ అంటూ అర్ధరాత్రి ప్రజలపై చిందులేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాదుడేబాదుడు కార్యక్రమంలో బాబునే జనం బాదుతున్నారని, దీంతో బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళుతోందని విజయసాయి అన్నారు.

More Telugu News