5 lakh crore: అమ్మకాలతో వణికిపోతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్

  • 300 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • బ్యాంకెక్స్ నష్టం 3 శాతం
  • ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
  • అంచనాల కంటే ఎక్కువగా యూఎస్ ద్రవ్యోల్బణం 
  • దెబ్బతిన్న మార్కెట్ సెంటిమెంట్
Rs 5 lakh crore gone 4 factors behind Sensex crash today

ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో కొంత కాలంగా మార్కెట్లు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అయినా, అమ్మకాల ఒత్తిడి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గురువారం కూడా నిఫ్టీ 300 పాయింట్లు, సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్ యూ బ్యాంకెక్స్ 3 శాతానికి పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. 

క్రితం ముగింపుతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్ఈ లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపునకు రూ.246 లక్షల కోట్లుగా ఉంటే, అది తాజాగా రూ.241 లక్షల కోట్లకు పడిపోయింది. మార్కెట్లో నష్టాలకు ప్రధాన కారణంగా యూఎస్ ద్రవ్యోల్బణం డేటా అని చెప్పుకోవాలి. నిజానికి మార్చిలో 8.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 8.3 శాతానికి తగ్గింది. కానీ, 8.1 శాతానికి తగ్గుతుందని వేసుకున్న అంచనాల కంటే ఎగువనే ఉండడం సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే ఫెడ్ వడ్డీ రేట్లను భారీగా పెంచుతుందన్న ఆందోళనే ఈక్విటీ అమ్మకాలకు ప్రేరణగా అనలిస్టులు చెబుతున్నారు. 

డాలర్ రేటు రెండు దశాబ్దాల గరిష్ఠం 103కు చేరింది. ఇది భారత్ సహా ఆసియా మార్కెట్లలో నష్టాలకు దారితీసింది. ఒక్క మే నెలలోనే 11వ తేదీ నాటికి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి రూ.17,403 కోట్లను వెనక్కి తీసుకున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు ఉపసంహరించుకున్న మొత్తం రూ.1,44,565 కోట్లుగా ఉంది. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ కమ్రంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News