Diya Kumari: తాజ్ మహల్ స్థలం మాది..: బీజేపీ ఎంపీ దియాకుమారి

  • అప్పట్లో షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడన్న దియాకుమారి 
  • పరిహారం ఇచ్చినప్పటికీ, అదేమంత? అంటూ ప్రశ్న 
  • నాడు పోరాడేందుకు న్యాయస్థానాలు కూడా లేవని వ్యాఖ్య 
  • సమాధికి ముందు అక్కడ ఏముందో తేలాలన్న జైపూర్ మాజీ యువరాణి 
Jaipur royal scion Diya Kumari stakes claim on land on which Taj Mahal was built

తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినది అంటూ బీజేపీ ఎంపీ, జైపూర్ మాజీ యువరాణి దియా కుమారి మీర్జా సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం తాజ్ మహల్ ఉన్న స్థలం జైపూర్ రాజకుటుంబానికి చెందినట్టు తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని ఆమె ప్రకటించారు. తాజ్ మహల్ కింద ఉన్న 22 గదులను తెరిపించి, అందులో హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయేమో తేల్చాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ లో కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో దియా కుమారి తాజ్ మహల్ స్థలం తమదిగా క్లెయిమ్ చేయడం ఆసక్తిని కలిగించింది.

లక్నో బెంచ్ లో పిటిషన్ ను దియా కుమారి సమర్థించారు. తాజ్ మహల్ నిర్మించడానికి ముందు ఏముందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాధికి ముందు అసలు ఏముందన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. తాజ్ మహల్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు జైపూర్ రాజ కుటుంబం వద్ధ ఉన్నాయంటూ అవసరమైతే వాటిని అందిస్తామని చెప్పారు. మొఘల్ పాలకుడు షాజహాన్ తమ కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. 

‘‘భూమికి సంబంధించి పరిహారం ఇచ్చారు. కానీ, అది ఎంత మొత్తం? దీన్ని ఆమోదించిందీ, లేనిదీ నేను చెప్పలేను. ఆ రికార్డులను నేను చదవలేదు. కానీ, ఆ భూమి మాత్రం మాదే. షాజహాన్ స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో న్యాయస్థానాలు లేవు. అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదు. అందుకే రికార్డులు అధ్యయనం చేయాలి. అప్పుడు విషయాలు వెలుగు చూస్తాయి’’ అని ఆమె చెప్పారు.

More Telugu News