Hyderabad: అక్రమ సంబంధాన్ని బయటపెడతానన్న ప్రియుడు.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో కలిసి హత్యచేయించిన వివాహిత

  • హైదరాబాద్ శివారులోని మీర్‌పేటలో ఘటన
  • పెళ్లి చేసుకోకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్
  • ఏపీకి చెందిన మరో ఫేస్‌బుక్ ఫ్రెండ్ సాయంతో హత్యకు కుట్ర
  • కటకటాలపాలైన వివాహిత, మరో ఇద్దరు నిందితులు
Boyfriend who wants to expose illicit relationship Woman who murdered along with Facebook friend

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత అతడు తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తుండడంతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో వ్యక్తితో అతడిని హత్యచేయించిందో గృహిణి. హైదరాబాద్ శివారులోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్ (32) ఫొటోగ్రాఫర్. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి (32) అనే వివాహితకు 2018లో ఫేస్‌బుక్ ద్వారా అతడు పరిచయమయ్యాడు. స్నేహం కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఒకసారి ప్రియుడి కోరిక మేరకు శ్వేత నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగినా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

నెల రోజుల నుంచి శ్వేతకు ఫోన్ చేస్తున్న యశ్మకుమార్ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలు, ఫొటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో తన గుట్టు బయటపడిపోతుందని భయపడిన ఆమె.. ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌లోనే పరిచయమైన కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన మరో ఫ్రెండ్ కొంగల అశోక్ (28)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. సరేనన్న అశోక్ ఈ నెల 4న హైదరాబాద్ చేరుకున్నాడు.

అదే రోజు రాత్రి ప్రియుడికి ఫోన్ చేసిన శ్వేతారెడ్డి ప్రశాంతి హిల్స్‌కు రప్పించి విషయాన్ని అశోక్‌కు చేరవేసింది. కార్తీక్ అనే మరో వ్యక్తితో కలిసి యశ్మకుమార్ ఉన్న ప్రదేశానికి వచ్చిన అశోక్ వెనక నుంచి సుత్తితో బాధితుడి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన యశ్మకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా శ్వేతారెడ్డే ఈ హత్య చేయించిందని తేలింది. దీంతో ఆమెతోపాటు అశోక్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

More Telugu News