IPL 2022: హాఫ్ సెంచ‌రీతో మెరిసిన అశ్విన్‌... ఢిల్లీ టార్గెట్‌ 161 ప‌రుగులు

  • ఫ‌స్ట్ డౌన్‌లోనే బ్యాటింగ్ కు వ‌చ్చిన అశ్విన్‌
  • 38 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించిన స్పిన్న‌ర్‌
  • అశ్విన్‌తో స‌మంగా రాణించిన ప‌డిక్కల్‌
161 is target for Delhi Capitals

ఢిల్లీ కేపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. సెంచ‌రీల‌తో ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన రాజస్థాన్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ కూడా చేతులెత్తేసిన వేళ‌.. రాజ‌స్థాన్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆ జ‌ట్టుకు ఆప‌ద్భాంధ‌వుడిలా నిలిచాడు. 

కీల‌క‌ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన సమయంలో‌... తొలి వికెట్ కోల్పోయాక వచ్చిన అశ్విన్ హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరును అందించాడు. కేవ‌లం 38 బంతులు ఎదుర్కొన్న అశ్విన్ 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 50 ప‌రుగులు సాధించాడు. అత‌డికి తోడుగా దేవ‌దత్‌ ప‌డిక్కల్ (48) రాణించ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి రాజ‌స్థాన్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన 160 ప‌రుగులు చేసింది. 

ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించింది. వ‌రుస‌గా వికెట్లు తీస్తూ సాగిన ఢిల్లీ బౌల‌ర్లు రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌ను క్రీజులో నిల‌దొక్కుకోకుండా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో చేత‌న్ స‌కారియా, ఎన్‌రిచ్ నోర్ట‌జే, మిచెల్ మార్ష్ త‌లా రెండు వికెట్లు తీసుకున్నారు. మ‌రికాసేప‌ట్లో 161 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో ఢిల్లీ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

More Telugu News