Harish Rao: ఏపీలో క‌రెంటు కోత‌ల‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు వ్యాఖ్య‌లు

  • ఏపీలో రోజుకు ఆరు గంట‌లు క‌రెంట్ పోతుంది
  • పొద్దున 3 గంట‌లు, సాయంత్రం 3 గంట‌లు క‌రెంట్ క‌ట్‌
  • చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ రోజుకు 6 గంటల క‌రెంటు కోత‌లు
  • క‌రెంటు కోత‌లు లేని రాష్ట్రం తెలంగాణే అన్న హ‌రీశ్
telangana minister harish rao commnets on ap power cuts

ఏపీలో మౌలిక స‌దుపాయాలు లేవంటూ ఇటీవల టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏ మేర మాట‌ల మంట‌ల‌ను పుట్టించాయో తెలిసిందే. తెలంగాణ కేబినెట్‌లో మ‌రో కీల‌క మంత్రిగా ఉన్న త‌న్నీరు హ‌రీశ్ రావు తాజాగా ఏపీలో కరెంటు కోతలున్నాయంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఆరు గంట‌ల పాటు క‌రెంట్ కోత‌లున్నాయ‌న్న ఆయ‌న‌.. తెలంగాణ‌లో రెప్ప‌పాటు సేపు కూడా క‌రెంట్ క‌ట్ అన్న‌దే లేదంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

మంగ‌ళ‌వారం మ‌హ‌బూబాబాద్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆయ‌న ఏపీలో క‌రెంట్ కోత‌ల‌పై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ "70 ఏళ్ల‌లో కాని ప‌నులు ఏడేళ్ల‌లో మీ అనుభ‌వంలో ఉన్నాయి. ఎవ‌రన్నా అనుకున్నారా? క‌నురెప్ప కొట్టినంత సేపు కూడా క‌రెంట్ పోకుండా తెలంగాణ‌లో 24 గంట‌ల పాటు కరెంట్ వ‌స్త‌ద‌నుకున్నమా మ‌నం. ఇవాళ కేసీఆర్ వ‌ల్ల‌ అది సాధ్య‌మైంది. 

ప‌క్క‌న మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పోయి చూడండి. రోజూ ఆరు గంట‌ల క‌రెంట్ క‌ట్ అయితుంది. పొద్దుగాల 3 గంట‌లు, పొద్దుమీకి 3 గంట‌లు క‌రెంట్ పోతుంది. ఇటు ప‌క్క‌న చ‌త్తీస్‌గ‌ఢ్ పోయి చూడండి. రోజూ ఆరు గంట‌ల క‌రెంట్ కోత ఉన్న‌ది. దేశం మొత్తం క‌రెంట్ కోత‌లున్న‌యి. క‌రెంటు కోత‌లు లేకుండా 24 గంట‌ల పాటు క‌రెంట్ ఇచ్చే రాష్ట్రం మ‌న తెలంగాణ రాష్ట్రం" అని ఆయ‌న అన్నారు.

More Telugu News