Asani: కాకినాడకు 210 కిమీ చేరువలోకి వచ్చేసిన 'అసని' తీవ్ర తుపాను

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని
  • తీవ్ర తుపానుగా మారిన వైనం
  • రేపు ఉదయం కాకినాడ-విశాఖ తీరాలకు అత్యంత చేరువలోకి రాక
  • పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం
Asani barrels towards AP coast

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని ఏపీ తీరాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో విశాఖకు 310 కిమీ దూరంలోనూ, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిమీ దూరంలోనూ ఉంది. 

అసని గత ఆరు గంటలుగా 25 కిమీ వేగంతో కదులుతోందని, రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి కాకినాడ-విశాఖపట్నం తీరాలకు అత్యంత చేరువగా వస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆపై కొద్దిగా దిశ మార్చుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను ఆనుకుని పయనం సాగిస్తుందని వివరించింది. మే 11వ తేదీ ఉదయానికి ఇది తుపానుగా బలహీనపడుతుందని, 12వ తేదీ ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. 

అసని తీవ్ర తుపాను ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక మే 11వ తేదీన కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. 

ఇక 12వ తేదీన తుపాను బలహీనపడుతుందని, దీని ప్రభావం ఏపీపై ఉండదని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అసని ప్రస్తుతం తీవ్ర తుపానుగా కొనసాగుతున్నందున తీర ప్రాంతాల్లో 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది. 

ఏపీలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో తీర ప్రాంతాలకు ఉప్పెన వచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని పేర్కొంది.

More Telugu News