Asani Cyclone: తుపాను హెచ్చరికల నేపథ్యంలో .. విశాఖకు విమాన రాకపోకలు బంద్!

  • విశాఖకు 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన అసని తుపాను
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
  • తీవ్ర గాలుల నేపథ్యంలో సర్వీసులను రద్దు చేసిన విమానయాన సంస్థలు
Air services cancelled to Vizag amid Asani cyclone

అసని తుపాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 350 కిలోమీటర్లు, పూరీకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో ఈరోజు, ఉత్తరాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... గురువారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. 

మరోవైపు, తుపాను నేపథ్యంలో విశాఖకు విమాన రాకపోకలు రద్దయ్యాయి. అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. తీవ్ర గాలుల నేపథ్యంలో సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి.

More Telugu News