Rajasthan Royals: రాణించిన టాపార్డర్... ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపర్చుకున్న రాజస్థాన్ రాయల్స్

  • ముగిసిన రాజస్థాన్, పంజాబ్ మ్యాచ్
  • 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం
  • అర్ధసెంచరీ చేసిన యశస్వి జైస్వాల్
  • బట్లర్, శాంసన్, హెట్మెయర్ మెరుపులు
Rajasthan Royals bags another win

పంజాబ్ కింగ్స్ తో పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాపార్డర్ విశేషంగా రాణించింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. జైస్వాల్ 41 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. 

మరో ఓపెనర్ జోస్ బట్లర్ 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో అవుటయ్యాడు. కెప్టెన్ సంజు శాంసన్ 12 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రోన్ హెట్మెయర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు), దేవదత్ పడిక్కల్ (31) కూడా రాణించడంతో రాజస్థాన్ గెలుపు ఏమంత కష్టం కాలేదు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, కగిసో రబాడా 1, రిషి ధావన్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఈ విజయం అందుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 11 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 7 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

More Telugu News