Cricket: ప్రాక్టీస్ తక్కువ, పార్టీలు ఎక్కువ.. ఆటగాళ్లతో గొడవలు.. అందుకే వార్నర్ ను పంపించేశాం: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

  • డేవిడ్ వార్నర్ కు అస్సలు క్రమశిక్షణ ఉండేదే కాదన్న సెహ్వాగ్ 
  • జట్టుకు అతడొక్కడే ముఖ్యం కాదని వ్యాఖ్య 
  • మిగతా ఆటగాళ్లూ కీలకమేనన్న సెహ్వాగ్ 
  • 2009 నాటి సంఘటనను గుర్తు చేసుకున్న లెజెండ్
Sehwag Sensational Comments On Warner

డేవిడ్ వార్నర్ పై టీమిండియా మాజీ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్), పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అయితే, 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడినప్పుడు జరిగిన సంఘటనల గురించి సెహ్వాగ్ తాజాగా చెప్పుకొచ్చాడు. 

ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఆడిన డేవిడ్ వార్నర్ విషయాలను పూసగుచ్చినట్టు చెప్పాడు. వార్నర్ కు క్రమశిక్షణ అన్నదే లేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో అతడి ప్రవర్తన అస్సలు బాగుండేది కాదన్నాడు. ‘‘నేను ఇద్దరు ఆటగాళ్లమీద అరిచాను. అందులో డేవిడ్ వార్నర్ ఒకడు. జట్టులో కొత్తగా చేరినప్పుడు ప్రాక్టీస్, మ్యాచ్ లకన్నా పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. తొలి సీజన్ లోనే తోటి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేవాడు. దీంతో ఆ సీజన్ ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగానే అతడిని పంపించేశాం. హద్దులు లేనివాళ్లకు గుణపాఠం నేర్పాలంటే అప్పుడప్పుడు ఇలా బయటకు పంపించేయాల్సి ఉంటుంది’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 

జట్టుకు అతడొక్కడే ముఖ్యం కాదని, ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారని వివరించాడు. అతడు లేకుండా కూడా ఢిల్లీ గెలిచిన సందర్భాలున్నాయని పేర్కొన్నాడు. మొన్న హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు డేవిడ్ వార్నర్ పై టాపిక్ రావడంతో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News