Amit Shah: సీఏఏ అమలు చేసి తీరుతాం: అమిత్ షా

  • దీదీ సర్కారు చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్న హోంమంత్రి 
  • వారి అజెండాను కొనసాగనీయబోమని హెచ్చరిక 
  • కరోనా అంతమయ్యాక సీఏఏను తీసుకొస్తామని వెల్లడి 
CAA will be implemented once Covid is over Amit Shah in Bengal

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి సారి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. న్యూ జలపాయ్ గురిలో ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి అంతమై పోయిన తర్వాత సీఏఏను అమలు చేస్తామని ప్రకటించారు. 

బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది అక్రమంగా పశ్చిమ బెంగాల్ కు వస్తూ పౌరసత్వాన్ని పొందుతున్న క్రమంలో అమిత్ షా మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శరణార్థులకు గుర్తింపు ఇవ్వాలని కేంద్రంలోని మోదీ సర్కారు చూస్తుంటే, తృణమూల్ కాంగ్రెస్ సర్కారు చొరబాట్లను అనుమతిస్తోందని ఆరోపించారు.

‘‘మేము సీఏఏ అమలు చేయకూడదని మమతా దీదీ సర్కారు కోరుకుంటోంది. చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. కానీ, వారి అజెండాను మేము కొనసాగనీయం. మహమ్మారి అంతం కానీయండి. సీఏఏను తీసుకొస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించడమే సీఏఏ లక్ష్యం. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేయగా.. దీనివల్ల భారతీయుల్లో ఏ ఒక్కరి పౌరసత్వానికి ముప్పు ఉండదని మోదీ సర్కారు లోగడ స్పష్టం చేయడం గమనార్హం.

More Telugu News