Terror Plot: ​తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు భారీ ఉగ్రకుట్ర... భగ్నం చేసిన పోలీసులు

  • మూడు రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్
  • నలుగురి ఉగ్రవాదుల అరెస్ట్
  • ఖలిస్థాన్ తో సంబంధాలు
  • తెలంగాణ, మహారాష్ట్రకు ఆయుధాలు తరలిస్తున్న వైనం
Police busted terror plot for explosions in Telangana and other states

దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టాయి. ఆ మేరకు వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హర్యానాలోని బస్తారా టోల్ ప్లాజా వద్ద అనుమానిత కారులో తనిఖీలు చేశారు. కారు నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటిలో పాయింట్ థర్టీ కాలిబర్ పిస్టళ్లు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ ఉన్నాయి. కారులోని నలుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అరెస్టయిన ఉగ్రవాదులను గురుప్రీత్, అమన్ దీప్, భూపేంద్ర, పర్మిందర్ గా గుర్తించారు. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వారు ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్ర తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ ఆయుధాలను ఉగ్రవాదులు దేశ సరిహద్దులకు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా తీసుకువచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్ ఈ ఆయుధాలు పంపినట్టు తెలిసింది.

More Telugu News