Russia: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల‌ను ప్రయోగించేందుకు ర‌ష్యా సన్నాహాలు

  • అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి దాడులపై సాధన
  • స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేసిన ర‌ష్యా 
  • కలినిన్ గ్రాడ్‌ నగరంలో ఈ సన్నాహకాలు
  • వైమానిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలపై క్షిపణులు ప్రయోగించేలా సాధన
russia attacks in ukrain

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొన‌సాగుతోంది. చాలా రోజులుగా భీక‌ర దాడులు చేస్తున్న‌ప్ప‌టికీ ఉక్రెయిన్ ను త‌న అధీనంలోకి తెచ్చుకోలేక‌పోతోన్న ర‌ష్యా ఇప్పుడు అణు యుద్ధాన్ని ప్రారంభించాల‌ని యోచిస్తోంది. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి దాడులపై సాధన చేస్తున్న‌ట్లు ర‌ష్యా ప్ర‌క‌ట‌న చేసింది. 

రష్యాలోని కలినిన్ గ్రాడ్‌ నగరంలో ఈ సన్నాహకాలు చేస్తున్నామ‌ని, బాల్టిక్‌ సముద్రంపై ఉన్న ఎంక్లేవ్‌లో ఇస్కాండెర్‌ మొబైల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ వ్యవస్థలోని ఎలక్ట్రానిక్‌ ప్రయోగ వ్యవస్థతో మాక్‌ డ్రిల్‌ చేపట్టామ‌ని తెలిపింది. ప్ర‌త్య‌ర్థి దేశాల‌ వైమానిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలు, కమాండ్‌ పోస్ట్‌లపై క్షిపణులు ప్రయోగించేలా సాధన చేసినట్లు వివ‌రించింది. అలాగే, ప్రతిదాడి నుంచి సైనిక సిబ్బంది తప్పించుకునే విన్యాసాలను కూడా చేపట్టినట్లు తెలిపింది.

దాడుల వ‌ల్ల వెలువడే రేడియేషన్‌, రసాయన పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా సాధన చేసినట్లు ర‌ష్యా పేర్కొంది. ఈ మాక్ డ్రిల్‌లో 100 మందికి పైగా రష్యా సైనికులు పాల్గొన్నార‌ని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విష‌యంలో ఇత‌ర దేశాలు జోక్యం చేసుకుంటే అణు దాడులు చేస్తామ‌ని ఇప్ప‌టికే ర‌ష్యా ప‌లుసార్లు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

More Telugu News