Amber Heard: కోర్టులోనే వెక్కివెక్కి ఏడ్చిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంబర్ హర్డ్

  • మాజీ భర్త జానీ డెప్ ఎప్పుడూ కొట్టేవాడన్న హర్డ్ 
  • తొలిసారి కొట్టినప్పుడు జోక్ అనుకున్నానని వెల్లడి
  • మళ్లీమళ్లీ తనపై దాడి చేశాడని ఆరోపణలు 
  • డ్రగ్స్, మద్యం మత్తులో అరాచకాలంటూ విచారం
Amber Heard Cried In Court Hall

హాలీవుడ్ స్టార్ హీరో, ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ హీరో జానీ డెప్ పై అతడి మాజీ భార్య, హీరోయిన్ అంబర్ హర్డ్ సంచలన ఆరోపణలు చేసింది. తరచూ కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి అరాచకాలు అన్నీఇన్నీ కావంటూ కోర్టు హాల్లోనే వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెపై జానీ డెప్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఆమె తొలిసారిగా కోర్టులో విచారణకు హాజరైంది. 

ఈ సందర్భంగా ఆమె తన వాదనలను వినిపించింది. తనను ఎప్పుడూ కొట్టేవాడని, తొలిసారి కొట్టినప్పుడు జోక్ అనుకుని నవ్వేశానని తెలిపింది. ‘‘ఒంటిపై చెరిగిపోయినట్టున్న టాటూ గురించి అడిగాను. ఏం రాసుందని ప్రశ్నించాను. ‘వినో’ అని రాసుకున్నానంటూ చెప్పిన జానీ.. నన్ను తొలిసారి కొట్టాడు. సర్లే జోక్ అనుకుని నేను నవ్వాను. కానీ, పదే పదే కొడుతూనే ఉన్నాడు. అలాగే షాక్ అయి చూస్తుండి పోయాను’’ అని ఆమె గుర్తు చేసింది. 

ఇదేమైనా జోక్ అనుకుంటున్నావా? అంటూ నోటితో చెప్పలేని బూతులు తిట్టాడని పేర్కొంది. ఆ రోజును, ఆ ఘటనను తానెప్పుడూ మరచిపోలేనని, తన జీవితాన్నే మార్చేసిందని విచారం వ్యక్తం చేసింది. తనపై దాడి ఆ ఒక్కసారితోనే ఆగిపోలేదని, పలుమార్లు అలాగే దాడిచేశాడని చెప్పుకొచ్చింది. మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ మత్తులో దాడి చేసేవాడని తెలిపింది. 2013 మేలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఆగ్రహంతో ఊగిపోయాడని చెప్పింది. 

ఆ రోజు సాయంత్రం ఓ అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడని తెలిపింది. ఆ యువతి బట్టలు చింపేసి డ్రగ్స్ కోసం వెతికాడని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతకుముందు సైకాలజిస్ట్ డాన్ హ్యూస్ ఎదుట కూడా ఆమె తన వివరణ ఇచ్చింది. 

కాగా, అంతకుముందు జానీ డెప్ కూడా తన వాదనను వినిపించాడు. తాను అసలు ఆమెను కొట్టనే లేదని, ఆమె తననూ హింసించేదని చెప్పాడు. గృహ హింస పేరుతో తన పరువును మొత్తం చెడగొట్టిందని ఆరోపిస్తూ అంబర్ పై 5 కోట్ల డాలర్లకు జానీ డెప్ పరువు నష్టం దావా వేశాడు. దానికి కౌంటర్ గా జానీపైనా ఆమె 10 కోట్ల డాలర్ల పరువు నష్టం దావా వేసింది. ఆ విచారణల సందర్భంగానే ఆమె ఏడ్చింది. 

2009లో ‘ద రమ్ డైరీ’ అనే సినిమా కోసం ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ డేటింగ్ చేశారు. 2015లో వివాహం చేసుకున్నారు. తనన మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపిస్తూ ఆ మరుసటి ఏడాదే విడాకుల కోసం అంబర్ హర్డ్ దరఖాస్తు చేసుకుంది. 2017లో విడాకులు మంజూరయ్యాయి.

More Telugu News