BJP: రాజ్యసభలో 100 మార్క్ దిగువకు బీజేపీ.. పార్టీల బలాబలాలు ఇవీ..!

  • పది రోజుల్లో ఐదు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పూర్తి
  • దీంతో 95కు తగ్గిన బీజేపీ బలం
  • ఏడుగురిని నామినేట్ చేస్తే పెరగనున్న సంఖ్య
  • రాష్ట్రపతి ఎన్నికకు ఇబ్బంది లేనట్టే
BJP Rajya Sabha strength falls below 100 may rise soon

రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 100కు చేరిన నెల రోజుల్లోనే మళ్లీ తగ్గిపోయింది. గత పది రోజుల వ్యవధిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం బీజేపీ సభ్యుల సంఖ్య 95కు తగ్గింది. అయితే, త్వరలోనే మళ్లీ 100 మార్క్ ను అధిగమించనుంది. ఎందుకంటే బీజేపీ మరో ఏడుగురు సభ్యులను పెద్దల సభకు నామినేట్ చేయగలదు. నామినేటెడ్ సభ్యులు బీజేపీ సభ్యత్వం తీసుకుంటారా? తటస్థంగా ఉంటారా? అన్నది చూడాల్సి ఉంది.

మరో 53 సీట్లకు జూన్-జూలైలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జూన్ లో 20 మంది, జులైలో 33 మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. రాష్ట్రపతి ఎన్నికలు జులైలోనే జరగనున్నాయి. కనుక ఆలోపే వీటి ఎన్నికను ఎలక్షన్ కమిషన్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా బీజేపీ తన బలాన్ని తిరిగి నిలబెట్టుకోనుంది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే విషయంలో బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. కాకపోతే ప్రతిపక్షాల్లో కనీసం ఒక పార్టీ మద్దతు అయినా అవసరం పడొచ్చు. బీజేడీ, వైసీపీల్లో ఏదో ఒకటి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. 

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలకు గాను ప్రస్తుతం 229 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే10, బీజేపీ, ఆప్ 8 చొప్పున, టీఆర్ఎస్, వైసీపీ 6 చొప్పున, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎం 5 చొప్పున, జేడీ యూ, ఎన్ సీపీ నాలుగు చొప్పున, బీఎస్పీ, శివసేన 3 చొప్పున, సీపీఐ, స్వతంత్రులు 2 చొప్పున, ఇతర చిన్న పార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ ఉన్నారు. 

More Telugu News