K Kavitha: ఆయన ధర్మపురి కాదు.. అధర్మపురి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

  • పసుపుబోర్డు తెస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారన్న కవిత 
  • మూడేళ్లయినా పసుపుబోర్డు రాలేదని విమర్శ 
  • అరవింద్ ను ఇకపై ఉపేక్షించబోమని హెచ్చరిక 
He is Adharmapuri Arvind says Kavitha

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పసుపు బోర్డు తెస్తానంటూ అబద్ధపు హామీలను ఇచ్చి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారని కవిత అన్నారు. ఆయన ధర్మపురి కాదని, అధర్మపురి అని విమర్శించారు. వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారని... మూడేళ్లయినా పసుపుబోర్డు రాలేదని దుయ్యబట్టారు. మోసం చేసిన ఆయనను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని చెప్పారు. 

ఈ మూడేళ్లలో పార్లమెంటులో పసుపు బోర్డు కోసం అరవింద్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని కవిత అన్నారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన నిధులు కూడా ఏమీ లేవని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం ఎంతో ప్రయత్నించానని... ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశానని... అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. 

అరవింద్ కు తాము ఇప్పటికే మూడేళ్ల సమయం ఇచ్చామని... ఇకపై ఉపేక్షించబోమని కవిత హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు తమపై దాడులకు పాల్పడాలని చూస్తే ఊరుకోబోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పారామిలిటరీ బలగాలను ఎదుర్కొన్న అనుభవాలు తమకు ఉన్నాయని తెలిపారు.

More Telugu News