Supreme Court: రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల సంగతి మీరు తేలుస్తారా? మమ్మల్ని తేల్చమంటారా?: కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

  • 10వ తేదీ వరకు కేంద్రానికి గడువు
  • ఆలోపు చెప్పకుంటే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని సుప్రీం స్పష్టీకరణ
  • ఈ విషయాన్ని తాము ఆషామాషీగా తీసుకోవడం లేదన్న సుప్రీం ధర్మాసనం
Will order Perarivalans release as you are not ready to argue Says Supreme Court

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. 

ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఈ నెల 10లోగా ఏదో ఒక విషయం చెప్పాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది.

రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే, తమ తరపున వాదించేందుకు ఎలాంటి అంశాలు లేవని కేంద్రం తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన న్యాయస్థానం తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

More Telugu News