K Kavitha: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ క‌విత‌.. బీజేపీ, కాంగ్రెస్‌ల‌పై విమ‌ర్శ‌లు

  • ప్ర‌జా తీర్పును గౌర‌వించి అర‌వింద్‌కు మూడేళ్ల టైమిచ్చామన్న కవిత 
  • నిజామాబాద్‌కు ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఏం చేశారని ప్రశ్న 
  • రాహుల్ గాంధీ తెలంగాణ‌కు ఏనాడూ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదని విమర్శ 
  • రాజ‌కీయాల కోస‌మే తెలంగాణ టూర్‌కు వస్తున్నారంటూ కామెంట్ 
trs mlc kavitha fireson nizamabad mp dharmapuri aravind and rahul gandhi

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కూతురు, ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌విత బుధ‌వారం నిజామాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీపైనా, ఆ రెండు పార్టీల నేత‌ల‌పైనా ఆమె విమ‌ర్శ‌లు సంధించారు. ప్ర‌త్యేకించి 2019 ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో త‌న‌ను ఓడించిన బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో రెండు రోజుల్లో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపైనా ఆమె విరుచుకుప‌డ్డారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ధ‌ర్మ‌పురి అర‌వింద్... క‌విత‌పై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన క‌విత‌... ప్ర‌జ‌లు ఎన్నుకున్న అర‌వింద్‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు అవ‌స‌ర‌మైనంత స‌మ‌యం ఇచ్చేందుకే ఈ మూడేళ్లు ఆయ‌న‌పై తాను ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ని తెలిపారు.

అయితే మూడేళ్ల కాలంలో త‌న‌ను గెలిపించిన నిజామాబాద్ ప్ర‌జ‌ల‌కు అర‌వింద్ చేసిందేమీ లేద‌న్నారు. ప‌సుపు బోర్డు ప్రాంతీయ కార్యాల‌యంతో పాటుగా ఇత‌ర‌త్రా కేంద్రం నుంచి వ‌చ్చిన అన్నీ కూడా తాను ఎంపీగా ఉన్న‌ప్పుడు వ‌చ్చిన‌వేన‌ని ఆమె తెలిపారు. ఇప్ప‌టికైనా నిజామాబాద్‌కైనా, యావ‌త్తు తెలంగాణ‌కైనా సేవ చేసేవాళ్లు ఎవ‌ర‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

మరోపక్క, తెలంగాణ‌కు ఏం చేశార‌ని రాహుల్ గాంధీ రాష్ట్ర పర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని క‌విత ప్ర‌శ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రంతో తెలంగాణ ప్ర‌భుత్వం పోరాటం సాగిస్తున్న స‌మ‌యంలో తెలంగాణ రైతుల‌కు అనుకూలంగా పార్ల‌మెంటులో మాట్లాడాల‌ని తాము రాహుల్ గాంధీని కోరామ‌ని, అయితే త‌మ విజ్ఞ‌ప్తిని ఆయన మ‌న్నించ‌లేద‌ని ఆరోపించారు. అయితే ఇప్పుడు కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే ఆయ‌న వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ‌కు మ‌ద్ద‌తిచ్చేందుకే వెనుకాడే రాహుల్‌కు తెలంగాణ‌తో ఏం ప‌ని? అని కూడా క‌విత ప్ర‌శ్నించారు.

More Telugu News